Telangana: తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠ.. లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై సస్పెన్స్
సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం నియోజకవర్గాలు, సీపీఎంకు వైరా, మిర్యాలగూడా స్థానాలు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించిన కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ శ్రేణులు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వైరాలో నేతలు ఏకంగా బహిరంగంగానే తమ నియోజకవర్గాన్ని సీపీఎంకు ఇవ్వొద్దని, అది కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే సీటు అని చెబుతూ ఆందోళన చేపట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. మరో 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 15 నుంచి 20 నియోజకవర్గాల విషయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని తెలిసింది. ప్రధానంగా ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సెగ్మెంట్లలో ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్నాయి. సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. సంఖ్య విషయంలో ఎలాంటి వివాదం లేనప్పటికీ ఏ ఏ స్థానాలను వారికి కేటాయించాలి అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.
సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం నియోజకవర్గాలు, సీపీఎంకు వైరా, మిర్యాలగూడా స్థానాలు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించిన కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ శ్రేణులు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వైరాలో నేతలు ఏకంగా బహిరంగంగానే తమ నియోజకవర్గాన్ని సీపీఎంకు ఇవ్వొద్దని, అది కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే సీటు అని చెబుతూ ఆందోళన చేపట్టారు. మిర్యాలగూడ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. పొత్తుల లెక్క తేలినా సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ తదుపరి జాబితా జాప్యానికి ఇది కూడా ఒక కారణమని నేతలు చెబుతున్నారు.
కీలక నేతలు టికెట్ ఆశిస్తున్న స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన ప్రవీణ్ రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదే టికెట్‌ను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సీపీఐ కోరుతోంది. ఇక్కడి నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.
కాంగ్రెస్ రెండో జాబితా ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? ఆలస్యానికి కారణాలేంటి..? రెబెల్స్ భయమా లేక మరేదైనా కారణం ఉందా..? తొలి జాబితా రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాలతో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలి లిస్టులో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాటు స్వరం వినిపించడం కూడా ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
