
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ఎన్నికల రణరంగంలో కదం తొక్కుతున్నాయి. ఈ క్రమంలో గెలిచేందుకు అవసరమైన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.. పొత్తుల కోసం ప్లాన్ రచించడంతోపాటు.. వ్యూహాలకు ప్లాన్ రచిస్తున్నాయి. తాజాగా.. తెలంగాణ రాజకీయాల్లో మరో పొత్తు పొడిచింది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవడంతో ప్రచారం, ఇతర వ్యూహాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. సహకరించిన వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా TJS అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, కర్నాటక మంత్రి బోసురాజు.. ఆ పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని కోరారు.
దాదాపు గంటపాటు కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల నేతల మధ్య చర్చలు జరగగా.. కాంగ్రెస్ ముందు 6 అంశాలను టీజేఎస్ నేతలు ఉంచారు. కేసీఆర్ సర్కారును గద్దె దించేందుకు ముందుండి నడిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కోదండరామ్‌ను కోరారు. సుధీర్ఘ చర్చ అనంతరం.. సీట్లు, పొత్తులు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు రేవంత్, కోదండరామ్ ప్రకటించారు. డిసెంబర్‌లో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ ప్రతినిధులు కచ్చితంగా ఉంటారని రేవంత్ హామీనివ్వడంతో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, కాంగ్రెస్ ప్రతిపాదనకు బేషరతు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జనసమితి చీప్ కోదండరామ్ ప్రకటించారు. కలిసి పనిచేసేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలు నిర్ణయ తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కొనసాగుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి బీఆర్‌ఎస్ నేతలకు లేదంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇదిలాఉంటే.. ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మరో విడత ప్రచారం చేసేందుకు ప్రియాంక, రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ మంగళవారం తెలంగాణను రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్రలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. అలాగే నవంబర్ ఒకటి, రెండు తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది. నవంబర్ ఒకటిన కల్వకుర్తి, జడ్చర్ల షాద్‌నగర్ సభల్లో ఆయన పాల్గొంటారు. నవంబర్ రెండున మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ సభల్లో రాహుల్ మాట్లాడతారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..