
క్యాలెండర్ మారింది. సరికొత్త ఏడాదికి స్వాగతం పలికింది ప్రపంచం. కానీ ఒకప్పుడు నూతన సంవత్సర వేడుకల్లో అంతర్భాగంగా ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ సందడి మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కాలగమనంలో సాంకేతికత పెరగడంతో కాగితంపై రాసే ఆత్మీయ పలకరింపులు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకే పరిమితమైపోయాయి. గతంలో డిసెంబర్ రెండో వారం రాగానే స్కూల్ విద్యార్థుల నుండి ఉద్యోగుల వరకు అందరి దృష్టి గ్రీటింగ్ కార్డ్స్ షాపులపైనే ఉండేది. రూపాయి కార్డు నుంచి వందల రూపాయల మ్యూజికల్ కార్డుల వరకు.. తమకు నచ్చిన వాటిని ఎంచుకోవడానికి గంటల తరబడి వెచ్చించేవారు. కార్డు వెనుక మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. అని స్వహస్తాలతో రాసే ఆ అక్షరాల్లో ఒక తెలియని ఆత్మీయత ఉండేది. ఇష్టమైన వారి కోసం రాసే ప్రత్యేక సందేశాలు మరింత మనసును పులకరింపజేసేవి. దూరంగా ఉన్న స్నేహితులు, బంధువుల నుంచి వచ్చే కార్డుల కోసం ఇంటి గుమ్మం వైపు ఆశగా చూడటం ఆ రోజుల్లో ఒక మధురమైన అనుభూతి.
స్మార్ట్‌ఫోన్ల రాకతో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడానికి సెకను చాలు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క క్లిక్ తో విషెస్ వెళ్ళిపోతున్నాయి. సుదీర్ఘమైన సందేశాల స్థానంలో రంగురంగుల ఎమోజీలు, జిఫ్ ఫైళ్లు వచ్చి చేరాయి. కాగితం వాడకం తగ్గాలన్న ఉద్దేశంతో చాలామంది ఈ-కార్డ్స్ వైపు మొగ్గు చూపుతున్నారన్నది మరొక కోణం. నేడు గ్రీటింగ్ కార్డ్స్ దుకాణాలు కనుమరుగయ్యాయి. పుస్తకాల షాపుల్లో ఒక మూలన తక్కువ సంఖ్యలో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. కొందరు పాత తరం వారు, మరికొందరు అభిరుచి గల యువత మాత్రమే ఇంకా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, చేతికి అందే గ్రీటింగ్ కార్డు ఇచ్చే ఆత్మీయతను డిజిటల్ మెసేజ్ భర్తీ చేయలేదన్నది వాస్తవం. కాలం మారినా, పద్ధతులు మారినా.. పలకరింపు వెనుక ఉన్న ప్రేమ మాత్రం మారదు. మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..