ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. పార్టీలోని కీలక నేతపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన కామెంట్స్ చేశారు. తాను మంత్రి పదవులు అనుభవించి పార్టీ మారలేదని.. కార్యకర్తగా పనిచేసి, టీడీపీని బతికించేందుకు చివరిదాకా పోరాడాను.. మీలా టీడీపీలో పదవులు అనుభవించలేదు అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్‌లో పార్టీ కోసం కేసులో కూడా ఇరుక్కున్నా.. అప్పటి పెద్దలందరూ టీడీపీని వీడిన తర్వాతే తాను పార్టీ మారానంటూ సండ్ర వ్యాఖ్యానించారు. టీడీపీలో కలిసి ఉండగా ఉండగా ఒకలా ఇబ్బంది పెట్టారు.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనే ఉండి మరోలా ఇబ్బందిపెడుతున్నారంటూ సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. సండ్ర వెంకటవీరయ్య చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. ఇది మరో కోల్డ్ వార్‌గానే పైకి కనిపిస్తున్నప్పటికీ.. ఈ వ్యాఖ్యలు కీలక నేతను ఉద్దేశించే చేసినట్లు పేర్కొంటున్నారు.
ఇంతకీ సత్తుపల్లి వీరయ్య చేసిన ఈ సెన్సేషన్ కామెంట్స్ ఎవరిపై? సండ్రను పార్టీలోనే ఉండి ఇబ్బంది పెడుతున్న ఆ వర్గం ఎవరు? ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ దుష్ప్రచారం ఏంటి. చేస్తోంది ఎవరు? ఇవన్నీ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కారు పార్టీ కార్యకర్తల్లో తలెత్తుతున్న ప్రశ్నలు.. సొంత పార్టీ నేతను ఉద్దేశించే మాట్లాడిన సండ్ర వెంకటవీరయ్య.. సత్తుపల్లి ప్రజలు విజ్ఞులు.. మీ ఆటలు సాగవ్ అంటూ కౌంటర్ ఇచ్చారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా.. అంతా గమనిస్తున్నారంటూ పేర్కొన్నారు. మీరు అభివృద్ధి చెయ్యలేదని నేను విమర్శించలేదని పేర్కొన్న సండ్ర.. ముసుగు తొలగించి రాజకీయం చెయ్యాలంటూ సవాల్ చేశారు.
అయితే, సండ్ర వెంకటవీరయ్య పేరైతే చెప్పలేదు గానీ.. లోకల్‌గా ఉన్న విశ్లేషణల ప్రకారం, సత్తుపల్లిలో సండ్ర ప్రత్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గానే కనిపిస్తున్నారు. ఇద్దరూ టీడీపీ నుంచే వచ్చారు. సండ్ర కంటే ముందే తుమ్మల పార్టీ మారారు. వీరయ్య చెబుతున్నట్లు టీడీపీలో ఉండగా మంత్రి పదవిలో పనిచేసింది తుమ్మల నాగేశ్వరరావే. కావున, సండ్ర నిప్పులన్నీ తుమ్మలపైనే అన్నది ఇక్కడ కనిపిస్తున్న క్లారిటీ. ఇంతకీ తుమ్మలకు, సండ్రకు చెడింది ఎక్కడ? ఏ విషయంలో ఇద్దరి మధ్య పంచాయితీ ముదురుతోందని తేలాల్సి ఉంది.
పాలేరు నుంచి పోటీకి తుమ్మల రెడీ అయినట్లు కనిపిస్తుంటే.. ఇక సత్తుపల్లిలో సండ్రతో ఉన్న ఇబ్బంది ఏంటన్నది వాళ్లిద్దరూ నోరు విప్పితేనే అసలు విషయం బయటపడుతుందని.. పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. సండ్ర వెంకటవీరయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఖమ్మం కారు పార్టీలో కలకలం రేపడంతోపాటు మరోసారి అంతర్గత విబేధాలు బయటపడినట్లయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..