cock knife: కోడి పందేల సరదా ఓ మనిషి ప్రాణం తీసింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే… జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో కోడి పందేలు నిర్వహించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు కోళ్లు తీసుకుని.. పందేల్లో పాల్గొనేందుకు వచ్చారు. వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్ కూడా తన కోడితో అక్కడికి చేరుకున్నాడు.
పందేలు తిలకించేందుకు జనాలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ క్రమంలోనే సతీష్ తన కోడిని బరిలోకి దించేందుకు కోడి కాలికి కత్తిని కట్టాడు. ఓ పక్కన కూర్చుని పందెం సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి.. కోడి బెదిరి తప్పించుకోబోయింది. ఈ క్రమంలో కోడిని కదలకుండా పట్టుకునేందుకు సతీష్ ప్రయత్నించాడు. దీంతో అప్పటికే దాని కాలికి కట్టిన కోడి కత్తి సతీష్ మర్మాంగానికి తగిలింది. దీంతో అతడి పురుషాంగం, వృషణాలకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో సతీష్ కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు అతడ్ని హుటాహుటిన జగిత్యాల ఏరియా హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నం చేశారు. అయితే సతీష్ దారిలోనే మృతిచెందాడు. . సతీష్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:
Telangana: నెల రోజుల్లో 10 మంది మరణం.. ఊరికి కీడంటూ ప్రచారం.. ఆ గ్రామస్థులు ఏం చేశారంటే..?
పిల్లలతో కలిసి భార్య సరుకులు తెచ్చేందుకు వెళ్లింది.. తిరిగొచ్చేసరికి భర్త ఇలా చేశాడు