Telangana: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. సమ్మిట్‌లో రెండో రోజు చర్చించుకునే అంశాలివే
గ్లోబల్ సమ్మిట్ గురించి ఒక్క తెలంగాణలోనే కాదు.. గ్లోబల్ కార్పొరేట్ వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటోందిప్పుడు. ఈ సమ్మిట్‌లో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. 2047 నాటికి తెలంగాణ లక్ష్యం ఏంటో గ్లోబల్ సమిట్‌లో చెప్పబోతోంది ప్రభుత్వం. మరి సర్కార్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది...?

రెండోరోజు సదస్సులో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచే ప్యానల్ డిస్కషన్స్ ప్రారంభమవుతాయి. సాయంత్రం 5.30 గంటల వరకూ వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చాగోష్ఠులుంటాయి. ముఖ్యంగా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మూసీ పునరుజ్జీవనం, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవృద్ధికి రాష్ట్రం ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక.. తదితర అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు గ్లోబల్ సమ్మిట్‌లో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో తీర్చిదిద్దే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రెడీ చేశారు. యువత, రైతులు, మహిళల సాధికారత ద్వారా 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ప్రతిభా కేంద్రంగా మార్చేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు ఈజ్ ఆఫ్ అట్రాక్టింగ్ టాలెంట్‌పై కూడా డాక్యుమెంట్‌లో దృష్టిసారించారు. మేధస్సును ఆకర్షించే తొలి రాష్ట్రంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలోని ప్రతీ రైతు 2047 నాటికి ఉత్పత్తిదారునిగా, ప్రాసెసర్‌గా, బ్రాండ్ యజమానిగా, ఎగుమతిదారుగా ఎదగాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక టెక్నాలజీతో పాటు సుస్థిర సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించనుంది. ఆర్థిక స్వేచ్ఛ, నైపుణ్యాలు, అవకాశాలు కల్పించి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. బాలికలకు నాణ్యమైన పాఠశాల విద్య, డిజిటల్ లెర్నింగ్, స్టెమ్ టెక్నాలజీ అందించడం వంటి అనేక భవిష్యత్ ప్రణాళికను విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు.
రాత్రి 7 గంటలకు కన్నుల పండువగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. వేలాది డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ అభివృద్ధి చిత్రాలను, విజన్ 2047 లక్ష్యాలను ఆవిష్కరించనున్నారు. ఒకేసారి 3 వేల డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్.. కమ్, జాయిన్ ది రైజ్’ అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని అద్భుతంగా ఆకాశంలో డ్రోన్లతో ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక రెండోరోజుకూడా సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. మొత్తంగా తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టడానికి.. గ్లోబల్ సమ్మిట్ బలమైన అడుగు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్.. హైదరాబాద్ భవిష్యత్తును మాత్రమే కాదు దేశంలోనే తెలంగాణని డెవలప్‌మెంట్ మోడల్‌గా నిలబెట్టనుందన్న చర్చ జరుగుతోంది.
