
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ధన్‌ఖడ్ రాజీనామాపై రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అటు మోదీ సైతం ధన్‌ఖడ్ దేశానికి విలువైన సేవలు అందించారంటూ ప్రశంసించారు. మరోవైపు కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు..? అన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామా దురదృష్టకరమన్నారు. ఇదే సమయంలో తెలంగాణకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని అడిగారు. ఇది ఇండియా కూటమి తరఫున కాదని.. తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్నట్లు తెలిపారు. మోదీ దత్తాత్రేయకు ఆ పదవి కట్టబెడితే.. తాను ఇండియా కూటమితో మాట్లాడతానని చెప్పారు. ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని.. కాబట్టి ఉపరాష్ట్రతి పదవిని ఓబీసీలకు ఇవ్వాలన్నారు. అలా అయితే బీసీలతో పాటు తెలంగాణకు న్యాయం చేసినట్లు అవుతుందని రేవంత్ అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తోందని రేవంత్ విమర్శించారు. రాంచందర్ రావు వాదన వింతగా ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్సే నెరవేర్చాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు ఓ రాజ్యాంగం, బీజేపీకి ఓ రాజ్యాంగం ఉండదని చెప్పారు. బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు సాకులు వెతుకుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపామని.. కానీ తీర్మానాన్ని ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. రాహుల్, ఖర్గేను కలిసి కులగణనపై చర్చిస్తామన్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్ అని వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..