Revanth Reddy: తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ.. బానిసత్వాన్ని భరించం.. దశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్‌ ప్రకటన

తెలంగాణ అవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురువేసిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సంధర్బంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ.. బానిసత్వాన్ని భరించం.. దశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్‌ ప్రకటన
Revanth Reddy

Updated on: Jun 02, 2024 | 11:51 AM

ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఏ హోదాలో ఆహ్వానిస్తారన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి రావడానికి తల్లికి ఏ హోదా కావాలని ప్రశ్నించారు సీఎం. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్బావ వేడుకల్లో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా ఇప్పటి వరకు రాష్ట్ర గేయం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వవమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని స్పష్టం చేశారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్‌ విడుదల చేశారు.

జై తెలంగాణ నినాదంతో ప్రసంగం ప్రారంభించిన సీఎం.. ఆకలినైనా భరిస్తాం.. స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమన్నారు. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరుముతామన్నారు. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమ మాకు లేదన్న రేవంత్ రెడ్డి, పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందన్నారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందన్నారు. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లి సోనియాకు హోదా అవసరమా? తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి పునర్ఘాటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…