Moosi River: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?

సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

Moosi River: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?
Cm Revanth Reddy On Musi River
Follow us
Prabhakar M

| Edited By: Balaraju Goud

Updated on: Nov 01, 2024 | 10:21 AM

ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు..మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మూసీపై ప్రకటనలే కాదు.. పునరుజ్జీవం దిశగా కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకటిన్నర లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదట మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. 15 రోజుల్లో గోదావరి నీటిని గండిపేటకి తరలించేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని బావిస్తోంది రాష్ట్ర సర్కార్.

మూసీ ప్రాజెక్టు తొలి దశలో గండిపేట నుండి బాపూఘాట్ వరకు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బాపూఘాట్ ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విగ్రహం ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాక, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా, సుందరీకరణ పనులు చేపట్టడం ద్వారా హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడం ద్వారా నది ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో ఎస్టీపీలను రూ. 7 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన నీరు మూసీలో కలుస్తుండటంతో, ఈ నది కాలుష్యం తగ్గనుంది. దీని కోసం ఈ వారం లో టెండర్లను పిలవనుంది ప్రభుత్వం. ఇందుకు మల్లన్న సాగర్ నుండి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు తొలి దశ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ముఖ్యంగా మూసీ పరిసర ప్రాంతాల శుభ్రత, సుందరీకరణ పనులు వేగంగా జరిగేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమవడం ద్వారా మూసీ నది పునరుద్ధరణకు కొత్త వెలుగులు తేవడమే కాకుండా, నగరంలోని ప్రజలకు పరిశుభ్ర నీటి వనరులు అందించడం కూడా సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..