అమెరికాలో అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అదానీపై కేసుతో బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు సంధిస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియకుండానే అదానీతో ఒప్పందాలు జరిగాయా అంటూ ప్రశ్నిస్తోంది.. అదానీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు.. ఈ మేరకు సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం విరాళాలు సేకరించామని.. చాలామంది విరాళాలు ఇచ్చారని సీఎం తెలిపారు. అందులో భాగంగానే రూ.100 కోట్లు అదానీ ఇస్తామన్నారని తెలిపారు. అదానీ నుంచి నిధులు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అదానీ డబ్బు తెలంగాణకు వద్దని.. రూ.100 కోట్లు నిరాకరిస్తూ అదానీకి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోలేదని.. అందులో అదానీ నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.. ఆదానీ పై కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదానీ వివాదంతో తెలంగాణకు సంబంధం లేదని తెలిపారు.
కొంత మంది ఢిల్లీ పర్యటన పై హర్రస్ పాట పాడుతున్నారని.. తాను ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లాలూచి పనుల కోసం తాను ఢిల్లీ వెల్లడం లేదన్నారు.. ప్రస్తుతం తన ఢిల్లీ పర్యటన .. ఓం బిర్లా కూతురు వివాహం కోసం వెళ్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళుతానని.. రావాల్సిన నిధులు రాబట్టుకుంటామంటూ పేర్కొన్నారు. మీ కడుపు మంట, దుఃఖం తమకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు.. ఎయిర్పోర్ట్ అండ్ మెట్రో రైల్ విషయంలో కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని.. ఆయా మంత్రులను కలుస్తానన్నారు.. అలాగే తెలంగాణ ఎంపీలతో కూడా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కూడా అదానీతో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయని.. కాంట్రాక్టులు, భూములు ఇచ్చింది వాళ్లేనంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2వేల 29 కోట్లు లంచాలు ఇచ్చారనే అభియోగంపై గౌతం అదానీ సహా ఏడుగురిపై న్యూయార్క్‌లో కేసు ఫైలయింది. అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు- ముడుపుల వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణలో రాజకీయ తుఫాన్‌గా మారింది. రెండు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరణ ఇచ్చారు.
తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ శివారులో ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ముచ్చర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 1న శంకుస్థాపన చేశారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను స్కిల్ యూనివర్సిటీకి ఏడాదిపాటు ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కో-ఛైర్మన్‌గా శ్రీనివాస్‌రాజు నియమితులయ్యారు.
పలు రంగాల్లో అంతర్జాతీయ పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనేలా తెలంగాణ యువకుల్లో నైపుణ్యాలను పొంపొందించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ సర్కారు ఏర్పాటు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల స్థలంలో ఈ యూనివర్సిటీ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ-కామర్స్ మరియు లాజిస్టిక్ రిటైల్ రంగాలలో సర్టిఫికేట్, డిగ్రీ కోర్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు 20 కోర్సులు ఉండబోతున్నాయి. ముచ్చెర్లలోని యూనివర్శిటీని నిర్మించే వరకు ఇది ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI), నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAAC) లేదా మరొక ప్రదేశంలో ఉండే తాత్కాలిక ప్రాంగణంలో పనిచేస్తుందని ఇటీవల చీఫ్ సెక్రటరీ ఎ. శాంతి కుమారి తెలిపారు.
వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..