జీహెచ్ఎంసీ, మున్సిపల్‌శాఖ పై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన పలు అవకతవకలపై ఆగ్రహం వ్యక్తంచేశారు సీఎం. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి అప్పజెప్పాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని సూచన చేశారు. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపనకు రెడీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. హెచ్ఎండీఏ కార్యాలయంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీపై నాలుగు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు దాన కిషోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్స్ ఫైల్స్ క్లియర్‌గా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్. చాలా బిల్డింగ్స్‌కి ఆన్‌లైన్ లేకుండా ఇష్టనుసారంగా పర్మిషన్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులకు సంబంధించిన ఫైల్స్ కనిపించకపోవడమేంటని ప్రశ్నించారు. 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయి. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికిపోతారని వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇక హెచ్ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని ప్రశ్నించారు. 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనన్నారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమీషనర్ లేని మున్సిపాలిటీల్లో గ్రూప్ 1అధికారులను నియమించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
మున్సిపాలిటీల్లో పని చేసే మున్సిపల్ వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు చేశారు. జీహెచ్ఎంసీలో వయస్సు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. కాలనీల్లో పర్యటించని జోనల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తాం.. లేదంటే ఇంటికి వెళ్లిపోవచ్చని జోనల్ కమిషనర్లకు సీఎం హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టీ యుటిలిటీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీధి దీపాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే హైదరాబాద్ నగరానికి మంచి నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే 50 ఏళ్లు తాగు నీటి అవసరాల కోసం ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..