Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palle Pragathi: జూలై 1 నుండి 10 వరకు పల్లె ప్రగతి కార్యక్రమం.. ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం

తెలంగాణలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.

Palle Pragathi: జూలై 1 నుండి 10 వరకు పల్లె ప్రగతి కార్యక్రమం.. ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2021 | 8:26 AM

CM KCR Review on Palle Pragathi: తెలంగాణలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. పచ్చదనం , పరిశుభ్రతే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతులు రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. జులై ఒకటి నుండి పది వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పాలనాపరమైన అంశాలపై జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, మునిసిపల్ ప్రధాన అధికారులు హాజరుకానున్నారు.

ఇటీవల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్య క్రమాల అమలు ఆశించిన రీతిలో లేకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇవాళ ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించ తలపెట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధి కారి (డీపీఓ), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల (డీఆర్డీఓ)ను తమ వెంట తీసుకురావాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులందరూ తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు.

ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాల అమలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పరిశీలించారు. ఆశించిన రీతిలో పురోగతి లేదని ఆయన గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుపై తన ఆశయాలు, లక్ష్యాలను అధికారుల ముందుంచారు.

అయితే, క్షేత్రస్థాయిల్లో పరిస్థితులు మారట్లేదని తాజాగా నిర్వహించిన పర్యటనల్లో సీఎం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూడు కార్యక్రమాల అమలు విషయంలో తన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను చివరిసారిగా వారికి స్పష్టం చేయాలని కేసీఆర్‌ ఈ సమావేశానికి తలపెట్టినట్టు సమాచారం. ఈ కార్యక్రమాల అమలుతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలకు ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేయనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు మరోసారి వారం పది రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, వచ్చే నెల నుంచి ముఖ్యమంత్రి రెండో విడతగా జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమాల అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కలెక్టర్లతో నిర్వహించనున్న సమావేశంలో వానా కాలం సాగు, రైతుబంధు పంపిణీ, ధరణి సమస్యల పరిష్కారం, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.

Read Also…  Vijayasaireddy: అశోక్‌ గజపతి రాజుపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి.. ఏకంగా వంశ చరిత్రను తిరగతోడుతూ..