CM KCR: గిరిజనులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన..

|

Sep 17, 2022 | 5:25 PM

వారం రోజుల్లోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు ఉండగా.. సీఎం ప్రకటనతో గిరిజనులకు మరో 4 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి

CM KCR: గిరిజనులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన..
Ts Cm Kcr
Follow us on

CM KCR announces 10 percent reservation for tribals : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాతీయ సమైక్యత దినోత్సవం రోజున గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. వారం రోజుల్లోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు ఉండగా.. సీఎం ప్రకటనతో గిరిజనులకు మరో 4 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. విద్య, ఉద్యోగ నియామకాల్లో సైతం గిరిజనులకు ప్రాధాన్యత పెరగనుంది. రిజర్వేషన్లతోపాటు త్వరలోనే గిరిజన బంధును కూడా అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. భూమి లేని గిరిజనులకు రూ.10 లక్షలు సాయం చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ’ లో సీఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు.

ముందుగా బంజారా, గిరిజన భవన్‌ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలంటూ సూచించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5, 6శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనులకు రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. కేంద్రానికి పంపి ఏడేళ్లు గడిచినా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రధాని, హోం మంత్రిని అడుగుతున్నా.. ఎందుకు తొక్కిపెడుతున్నారంటూ విమర్శించారు. చేతులు జోడించి తెలంగాణ గడ్డపై నుంచి ప్రధానిని అభ్యర్థిస్తున్నా.. రాష్ట్రపతి ముద్ర కొట్టించి పంపిస్తే మేం జీవో విడుదల చేస్తామంటూ సూచించారు.

న్యాయమైన హక్కునే కోరుతున్నామని.. ఎనిమిదేళ్లలో కేంద్రం ఒక్క మంచి పని చేసిందా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తోందని తెలిపారు. రిజర్వేషన్లతోపాటు త్వరలో ‘గిరిజన బంధు’ ప్రారంభిస్తామని తెలిపారు. సంపద పెంచడం.. పేదలకు పంచడం.. ఇదే తమ సిద్ధాంతమని, పోడు రైతులకు భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మళ్లీ కల్లోలాలకు గురి కావద్దని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..