లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు.. పార్టీలో కీలకమైన నేతలకు ఆయా కార్పొరేషన్ పోస్టులను ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఇటీవల దాదాపు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ నియమాకాల నిర్ణయం ఒకవైపు పార్టీలో.. మరొవైపు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నేతల మధ్య చిచ్చు రాజేస్తోంది. ప్రధానంగా తాము సూచించిన నేతలకు పదవులు దక్కలేదని, మరికొంత మంది తమను సంప్రదించకుండానే పోస్టులను భర్తీ చేస్తున్నారని గుర్రుగా ఉన్నారట.
నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్రుగా ఉన్నారట. ఉమ్మడి కరీంనగర్ విషయంలో తాను సూచించిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని సీరియస్‌గా ఉన్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం మంత్రి శ్రీధర్‌బాబు మనుషులకే పోస్టులు దక్కాయని, తాను సూచించిన వారికి అవకాశం రాలేదని గుర్రుగా ఉన్నారట. కరీంనగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నియామకంపై పొన్నం మరింత ఆగ్రహంగా ఉన్నారట. కరీంనగర్ లోక్ సభ ఇంచార్జ్‌గా ఉన్న తనను సంప్రదించకుండా భర్తీ చేయడంపై అసంతృప్తిగా ఉన్నారట.
ఈ విషయంలో రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షికి ఫోన్ చేసి, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి సైతం ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారట. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద, అయిత ప్రకాష్ రెడ్డి, జనక్ ప్రసాద్ ఇలా అందరూ శ్రీధర్‌బాబు వర్గానికి చెందిన వారికే పదవులు దక్కడంపై పొన్నం గుర్రుగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.
అలాగే మరో సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సైతం అసంతృప్తిగా ఉన్నారు. తన శాఖ పరిధిలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల విషయం కూడా తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇరిగేషన్ శాఖలోని ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా కొల్లాపూర్‌కు చెందిన జగదీశ్వర్ రావును నియమించారు. దీంతో ఉత్తమ్ అసంతృప్తిగా ఉన్నారట. ఇక పార్టీలో సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ గౌడ్ సైతం అసంతృప్తిగా ఉన్నారట. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా, తనను మాట మాత్రం సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సీనియర్ నేతగా తనను సంప్రదించకుండా పోస్టులు భర్తీ చేశారంటూ గుర్రుగా ఉన్నారట.
అలాగే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అన్యాయం జరిగిందంటూ మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు మైనారిటీ నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కినా.. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎమ్‌ఐఎమ్‌తో పోరాడుతున్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం జెండా మోసిన వారికి అవకాశం దక్కడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో లాభం జరుగుతుందని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే, నేతల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు సైతం నామినేటెడ్ పోస్టుల విషయంలో కినుక వహిస్తున్నారు. చూడాలి ఈ వ్యవహారం మునుముందు ఎటువైపుకు దారి తీస్తుందనేది..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…