గంజిలేక గొంతు తడారిన బతుకులు. ఈ చరిత్రను మార్చేయాలన్నది సీఎం KCR సంకల్పం. దళితుల జీవితాల్లో కొత్త ఉషస్సులు తీసుకొస్తానని భరోసా ఇస్తున్నారాయన. మొండి పట్టు పడదాం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుద్దామంటూ దళితబంధు పథకంపై సూటిగా చెప్పారు CM KCR. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని అంతే పకడ్బందీగా పట్టాలెక్కించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. తెలంగాణలో దళితుల అభ్యున్నతి, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి రూపకల్పన చేస్తున్నారు. దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకు ప్రగతి భవన్‌లో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని భావిస్తున్న దళిత బంధుపై ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం విజయవంతం అయ్యిందని గుర్తుచేశారు. ఇప్పుడు దళిత బంధు కూడా అలాగే విజయవంతం అవుతుందని.. అక్కడక్కడా వ్యతిరేక శక్తులు ఉన్నా.. ఎదుర్కొని నిలబడతాం అన్నారు. ప్రతిభ గల దళితులను ఊరి చివరకు వుంచి ఉత్పాదక రంగాలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత బంధు కోసం లక్ష కోట్ల నిధులను అయినా ఖర్చు చేయడానికి సిద్దమన్నారు. ఆర్థికంగా పటిష్టం అయినపుడే దళితులు వివక్ష నుండి బయటపడతారని కేసీఆర్ పేర్కొన్నారు. మనలో నిబిడీకృతమైవున్న పులి లాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. ఇప్పటికైనా దళారుల మోసాల నుండి దళితులు బయటపడాలని సూచించారు.
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి శాశ్వతంగా తొలగించినట్లుగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుందని… సర్కారే స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలన్నారు.
ఇక పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు హుజురాబాద్ నుండి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుండి 427 మంది దళితులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. దళిత బంధు అమలు, విధివిదానలపై సీఎం ఈ సదస్సులో సీఎం వివరించనున్నారు. ప్రస్తుతం దళిత అవగాన సదస్సులో పాల్గొన్నవారు భవిష్యత్ లో దళిత సమాజానికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా ఆయన దళిత బంధు ఓ కార్యక్రమం కాదు.. ఉద్యమం అని ముఖ్యమంత్రి KCR అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ సదస్సులో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.