Medak: ఆకలయినప్పుడు, దాహం వేసినప్పుడు అలా సరాదాగా వచ్చి వెళ్తున్నాయ్.. హడలిపోతున్న స్థానికులు
చిరుతపులి ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది.. అలాంటిది నిత్యం మనం నివసిస్తున్న ప్రాంతాల్లోకి అవి వస్తుంటే.. కాలు కూడా భయపెట్టాలి అంటే వణుకు పుడుతంది. మెదక్ జిల్లా రామయంపేట పరిసర ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. నిత్యం చిరుతలు సంచరిస్తూ ఉండటంతో ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.

రామాయంపేట పరిసర ప్రాంతాల ప్రజలను చిరుతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం పంట పొలాల వద్దకు వస్తూ పశువుల పై దాడులు చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో చిరుతలు గ్రామాల బాట పడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే చిరుతలు… ఐదు పశువులు, ఒక దుప్పిని హతమార్చాయి. తమపైన దాడికి దిగుతాయని అటవీ ప్రాంతానికి సమీప గ్రామాల ప్రజలు, గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా శనివారం రాత్రి మూడు చిరుతలు కాట్రియాల తండా వద్ద ఉన్న కుంటలో నీరు తాగడానికి వచ్చి దుప్పిని చంపాయి.. అటవీశాఖ అధికారులు ఈ వేసవిలో అడవిలో వణ్యప్రాణులకు తాగు నీటి సదుపాయం కల్పించకపోవడంతో.. ఇలా గ్రామాలు,తండాలకు వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి. నిజాంపేట, రామాయంపేట, కాట్రియాల, తోనిగండ్ల తండాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నాయి. వీరంతా తమ పశువులను శివారులోని బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. అలాంటి జీవాలపై దాడులకు పాల్పడుతున్నాయి చిరుతలు. గత రెండు నెలలుగా తరచూ చిరుతలు ఏదో ఒక చోట పశువులపై దాడి చేస్తున్నాయి. నెల క్రితం ఒకే రాత్రి కొట్టంలో ఉన్న పశువులపై దాడికి పాల్పడి ఏకంగా ఐదు లేగ దూడలను చిరుతలు హతమార్చాయి. మరో వైపు వేసవిలో తాగు నీటి కోసం చిరుతలతో పాటు ఇతర జంతువులు కూడా గ్రామాలు, తండాల వద్దకు వస్తున్నాయి. వీటిని ప్రత్యక్షంగా చూస్తున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజాగా మూడు రోజుల క్రితం చిరుతతో పాటు రెండు పిల్లలు కుంట వద్దకు వచ్చాయి.అదే సమయంలో తాగు నీటి కోసం వచ్చిన దుప్పిని హత మార్చాయి.. భయాందోళన చెందిన తండా గిరిజనులు ఈవిషయమై అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలిని పరిశీలించిన అధికారులు అక్కడే పంచనామా నిర్వహించి దుప్పి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. దీంతో తండావాసులు అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు. తండాను ఆనుకొని ఉన్న జైత్య కుంటలోకి తాగునీటి కోసం చిరుతలతో పాటు ఇతర వణ్యప్రాణులు రోజూ వస్తున్నాయి.. వీటి వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పలువురు రైతులు.. చిరుతలను బంధిచాలని కోరుతున్నారు. ఇక చిరుతలు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు అధికారులు. రాత్రివేళ ఆరు బయటకు ఒక్కరే వెళ్ల వద్దు అని, వెళ్తే గుంపులుగా, కర్రలు చేతపట్టుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. చిరుతలు కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.