Miss World 2025: నేడు కాకతీయ వాసరత్వ సంపద, శిల్పాకళ సందర్శనకు అందగత్తెలు.. వాహ్ వరంగల్ అనేలా ఏర్పాట్లు.
కాకతీయుల వారసత్వ సంపద, శిల్పకళా వైభవాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు.. ప్రపంచ సుందరీమణుల సందర్శన కోసం కాకతీయ శిల్ప సంపదకు నిలయమైన రామప్ప ఆలయం, వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. అందగత్తెలు అబ్బురపోయేలా వాహ్ వరంగల్ అనేలా ఆ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు ఇప్పుడు నయా లుక్ తో వెలిగి పోతున్నాయి..

వరంగల్ జిల్లాలో ఈ రోజు ప్రపంచ అందాల సుందరిమణులు రెండు టీములుగా పర్యటించనున్నారు.. గ్రూపు- 1 టీమ్ లో22 మంది, గ్రూప్-2లో 35 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటించనున్నారు. గ్రూప్ వన్ కు చెందిన 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు ప్రాచీన శైవ క్షేత్రమైన వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించి, ఖిలా వరంగల్ కోటను సందర్శిస్తారు.
ఈరోజు సాయంత్రం 4.30 నిమిషాలకు హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ కు గ్రూప్1 బృందం చేరుకుంటుంది. 5:40 నిమిషాలకు వేయి స్తంభాల ఆలయానికి చేరుకొని రుద్రేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 6:20 కి ఖిలా వరంగల్ కోటకు చేరుకుంటారు. ప్రపంచ సుందరిమనుల పర్యటన నేపథ్యంలో ఖిలా వరంగల్ కోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా కోటలో…అబ్బుర పరిచేలా లైటింగ్ మ్యూజిక్, పేరిణి శివతాండవం, భరతనాట్యం ప్రదర్శించనున్నారు. ఫోటోషూట్ అనంతరం, ఓరుగల్లు ప్రత్యేకమైన కలంకారీ దర్రీస్ బహుమతులను మంత్రులు సుందరీమణులకు అందించనున్నారు. అక్కడి నుండి తిరిగి హరిత హోటల్ లో డిన్నర్ అనంతరం హైదరాబాద్ కు తిరిగి వెళ్తారు.
గ్రూప్- 2లోని 35 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ప్రత్యేక బస్సులో ములుగు జిల్లాలోని రామప్పకు చేరుకుంటారు. సాయంత్రం 4.30నిమిషాలకు రామప్ప సరస్సు పక్కనే ఉన్న హరిత హోటల్ కాటేజీలోకి చేరుకుంటారు..అక్కడి నుండి సాంప్రదాయ దుస్తుల్లో రామప్ప ఆలయానికి వెళ్ళనున్నారు అందగత్తెలు. 5:25 నిమిషాలకు రామప్ప ఆలయ పశ్చిమ గేటు నుండి గార్డెన్ లోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.. స్థానిక మంత్రి సీతక్క వారికి ఘనస్వాగతం పలుకుతారు.. అతిథులను గిరిజన నృత్య కళాకారులు కొమ్ము కోయ డాన్సులతో స్వాగతం పలుకుతారు.. 5:35 నిమిషాలకు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని దేవాలయంలోని శిల్పకలను పరిశీలిస్తారు. 6:30 నుండి 7:25 వరకు రామప్ప గార్డెన్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై పేరుని నృత్యం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను వీక్షించనున్నారు. 7:25కు మంత్రి సీతక్క మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లను ప్రత్యేక వెదురుబొమ్మల బహుమతులతో సత్కరించనున్నారు. రాత్రి 8 గంటలకు రామప్ప లోనే ప్రత్యేక వంటకాలతో విందు ఉంటుంది. అనంతరం హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు.
ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపద్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 4 గంటల నుండి వరంగల్ లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.. ఖిలా వరంగల్ కోట, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసారు. ఓరుగల్లు చారిత్రక గొప్పతనం విశ్వవ్యాప్తం అయ్యేవిధంగా ప్రపంచ సుందరీమణుల పర్యటన ఉండబోతోంది. సుందరీమణుల పర్యటన కోసం వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, ములుగు SP శబరీష్ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఓరుగల్లులోని ప్రధాన జంక్షన్ లను ప్రత్యేక ఆకర్షణగా ముస్తాబు చేశారు. రామప్ప ఆలయాన్ని, ఖిలా వరంగల్ కోటలోని కాకతీయుల కళాతోరణాన్ని త్రివర్ణ రంగుల లైట్ లతో ముస్తాబు చేశారు. మొత్తం మీద సుందరీమణులు వాహ్ వరంగల్ అనేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..