Telangana: గుడ్ న్యూస్.. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం

తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హ్యామ్ మోడల్‌లో రూ.25,661 కోట్లతో 431 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 124 ప్రాజెక్టుల్లో తెలంగాణకు ఐదు చోటు దక్కాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Telangana: గుడ్ న్యూస్.. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం
Telangana Roads

Edited By: Ram Naramaneni

Updated on: Oct 13, 2025 | 4:43 PM

తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊపిరి నింపింది. హ్యామ్ (Hybrid Annuity Model) విధానంలో పలు కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.25,661 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో కేంద్రం 40 శాతం, నిర్మాణ సంస్థలు 60 శాతం నిధులు వెచ్చించనున్నాయి.

దేశవ్యాప్తంగా 124 రహదారులకు ఆమోదం – తెలంగాణకు ఐదు

కేంద్రం దేశవ్యాప్తంగా 124 జాతీయ రహదారుల నిర్మాణాన్ని ఆమోదించింది. మొత్తం రూ.3.45 లక్షల కోట్లతో 6,376 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టే ప్రణాళిక రూపొందించారు. వీటిలో తెలంగాణకు చెందిన ఐదు ప్రధాన మార్గాలకు చోటు దక్కింది.

అర్మూర్–జగిత్యాల, జగిత్యాల–మంచిర్యాల్ మార్గాలను నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. అలాగే జగిత్యాల–కరీంనగర్ మధ్య రహదారి విస్తరణ కూడా ఈ జాబితాలో ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–పనాజీ సెక్షన్‌లోని మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ వరకు ఉన్న ఎన్‌హెచ్–167 రహదారికి కూడా నిధులు కేటాయించారు.

ప్రధాన ప్రాజెక్టులు – నిధుల వివరాలు

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణానికి రూ.15,627 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ 160 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి ఎన్‌హెచ్–161ఏఏగా నిర్ణయించారు.

మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గూడెబల్లూరు వరకు 80 కిలోమీటర్ల మార్గాన్ని రూ.2,662 కోట్లతో ఫోర్ లేన్‌గా విస్తరించనున్నారు.
జగిత్యాల–మంచిర్యాల్ రహదారికి రూ.2,550 కోట్లు, అర్మూర్–జగిత్యాల రహదారికి రూ.2,338 కోట్లు, జగిత్యాల–కరీంనగర్ రహదారికి రూ.2,384 కోట్ల నిధులు కేటాయించారు.

రాష్ట్ర రహదారులకు కొత్త ఊపిరి

ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర రవాణా వ్యవస్థలో పెద్ద మార్పు రావొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర రహదారులు విస్తరించడంతో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక రంగాలకు కూడా ఈ రహదారులు కొత్త అవకాశాలను తెరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.