కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా మనిషి జీవన విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ అన్నింటిలోనూ వచ్చిన మార్పులతో మనిషి రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మరోవైపు వయసుతో సంబంధం లేకుండా.. హఠాత్తుగా కుప్పకూలిపోయారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ 40 ఏళ్ల కే గుండెపోటుతో మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అవును పునీత్ నుంచి తారకరత్న దాకా.. గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. నిత్యం వ్యాయామం చేసేవారినీ కూడా హార్ట్ ఎటాక్ వదులడం లేదు. ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు.. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్.. కారణమేదైనా నాలుగు పదుల వయసులోనే చాలా మంది ఊపిరి ఆగిపోతోంది. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి, తిరిగి లేవడంలేదు.
గతంలో స్థూలకాయులు, కాస్త వయసు పైబడిన వారు గుండెపోటుతో చనిపోతుండేవారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. సన్నగా ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నా సరే గుండె పోటు ముప్పు నుంచి తప్పించుకోలేక పోతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీ కాల కత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి అందరితో నవ్వుతూ పలకరిస్తూ కుప్పకూలి మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా మరో దుర్ఘటన చోటు చేసుకుంది..
విశాల్ అనే కానిస్టేబుల్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. సికింద్రాబాదులోని ఓ జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా విశాల్ కుప్పకూలిపోయాడు. విశాల్ పరిస్థితిని గమనించిన తోటి మిత్రులు వెంటనే స్పందించి.. అతడిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విశాల్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు
టీవీ9 రిపోర్టర్ : నూరు మహమ్మద్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..