పులులకు కొత్త టెన్షన్.. మనుషులు చేసే పనితో వాటి మనుగడకే ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

పులిని చూడాలనే మీ సరదా.. వాటికి శాపంగా మారుతోంది.. అడవిలో ప్రశాంతత కరువై, మనుషుల రాకతో పులులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఆడ పులుల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అవి గర్భధారణకు దూరమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలోని ప్రధాన టైగర్ రిజర్వుల్లో రెండేళ్ల పాటు సాగిన ఈ పరిశోధన, వన్యప్రాణుల సంరక్షణపై ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.

పులులకు కొత్త టెన్షన్.. మనుషులు చేసే పనితో వాటి మనుగడకే ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Tourism Stress Is Affecting Tiger Fertility

Edited By:

Updated on: May 09, 2026 | 10:29 AM

అడవుల్లో పులులను దగ్గరగా చూడాలనే ఉత్సాహంతో పెరుగుతున్న టైగర్ సఫారీలు ఇప్పుడు వాటి మనుగడకే ముప్పుగా మారుతున్నాయా? హైదరాబాద్‌లోని CSIR-Centre for Cellular and Molecular Biology శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఇదే ఆందోళన వ్యక్తం చేస్తోంది. టూరిస్టుల రద్దీ, వాహనాల శబ్దాలు, అడవుల్లో ప్రశాంతత లేకపోవడం వల్ల పులుల్లో స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, ముఖ్యంగా ఆడ పులుల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోందని పరిశోధనలో తేలింది. దేశంలోని ప్రధాన టైగర్ రిజర్వుల్లో రెండేళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కార్బెట్, తడోబా అంధారి, కాన్హా, బాంధవ్గఢ్, పెరియార్ రిజర్వుల్లో 2020 నుంచి 2023 వరకు మొత్తం 610 పులుల మల నమూనాలను సేకరించి విశ్లేషించారు. వీటిలో 291 ఆడ పులులు, 185 మగ పులుల నమూనాలు ఉన్నాయి.

ఈ పరిశోధనలో పులుల్లో ఒత్తిడిని సూచించే గ్లూకోకార్టికాయిడ్ హార్మోన్లు అధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో సంతానోత్పత్తికి కీలకమైన ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలో అసమతుల్యత కనిపించింది. దీనివల్ల ఆడ పులులు గర్భధారణకు దూరమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశ్చర్యకరంగా, అడవిలో అత్యంత సురక్షితంగా భావించే కోర్ ఏరియాల్లో ఉండే పులులకే ఎక్కువ ఒత్తిడి కనిపించింది. బఫర్ జోన్లలో తిరిగే పులులు కొంతవరకు మనుషుల ఉనికికి అలవాటు పడినా, కోర్ జోన్‌లో ఉన్న పులులు టూరిస్టుల రాకతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా తడోబా, బాంధవ్‌గఢ్ రిజర్వుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా నమోదైంది.

ఈ విషయంపై స్పందించిన సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జి.ఉమాపతి.. పులులు ఆరోగ్యంగా పిల్లలను కనాలంటే ప్రశాంతమైన వాతావరణం అత్యవసరమన్నారు. టూరిజం వల్ల ఆ ప్రశాంతత దెబ్బతింటోందని, కొన్ని ప్రాంతాల్లో ఆడ పులులు గర్భధారణకే దూరమవుతున్నాయని వివరించారు. ఒకవేళ పిల్లలు పుట్టినా అవి ఆరోగ్యంగా పెరగడం లేదని తెలిపారు. టూరిజానికి వ్యతిరేకం కాదని, కానీ పులుల ప్రైవసీకి భంగం కలగకుండా చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అడవుల్లో వాహనాల సంఖ్య తగ్గించడం, సఫారీ సమయాన్ని కుదించడం, ఒకే చోట వాహనాలు గుమిగూడకుండా నియంత్రణలు పెట్టడం అత్యవసరమని సూచించారు.

పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. టూరిస్టులు తక్కువగా వెళ్లే ప్రాంతాల్లో నీటి వనరులు ఏర్పాటు చేయడం, సంతానోత్పత్తి హాట్‌స్పాట్లను ప్రత్యేకంగా రక్షించడం, ఆడ పులులపై నిరంతర నిఘా పెట్టడం వంటి చర్యలు కీలకమని తెలిపారు. ఈ అధ్యయనం వన్యప్రాణుల సంరక్షణలో మాలిక్యులర్ బయాలజీ ఎంత కీలకమో నిరూపించిందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. పులులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటి ఆరోగ్య పరిస్థితి, ఒత్తిడి స్థాయిలను గుర్తించగల టెక్నాలజీ భవిష్యత్తులో సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పుడైనా టూరిజం నియంత్రణపై చర్యలు తీసుకోకపోతే.. రాబోయే తరాలు పులులను అడవుల్లో కాకుండా కేవలం ఫోటోలు, వీడియోల్లో మాత్రమే చూసే పరిస్థితి రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Follow Us