
ప్రపంచం అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక కాలంలోనూ అనాగరికం రాజ్యమేలుతోంది అనడానికి ఈ ఘటన నిదర్శనం. భూ పంచాయితీలో తమ మాట వినలేదంటూ గిరిజన కుటుంబాలను వెలి వేశారు. మాననీయత లోపించిన కొందరు మనుషులని దూరంగా ఉంచుతున్నారు. తమ కులం నుండి బహిష్కరించి వారిని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పాత పూస పెళ్లి గ్రామంలో కుల బహిష్కరణ చర్చనియాంశంగా మారింది. ఓ భూ వివాదంలో గ్రామ పెద్దలు చెప్పినట్టు వినలేదని తమను కులం నుండి బహిష్కరించారని బాధిత ఐదు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
పాత పూసపెల్లి గ్రామంలో ముడిగే వంశస్తులైన గిరిజనులు రాములు, సీత, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ అనే ఐదు కుటుంబాలకు మొత్తం 35 ఎకరాల భూమి ఉంది. 8 ఎకరాల భూమి తమకు రావాలి అంటూ కుంజ నరేష్, వినోద్, కుంజ భారతి తమపై గొడవకు దిగి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముడిగే వంశస్థులైన ఐదు కుటుంబాల వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి విషయంలో పెద్ద మనుషులు జోక్యం చేసుకొని తమకు అన్యాయమైన తీర్పు ఇవ్వటంతో తాము ఒప్పుకోలేదని దాంతో కోపోద్రిక్తులైన పెద్ద మనుషులు తమను గ్రామం నుండి కుల బహిష్కరణ చేశారని బాధితులు ముడిగే రాములు, సత్యనారాయణ, ఐదుగురు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని మా తాత తండ్రుల నుండి సేద్యం చేస్తున్నామని తెలిపారు.
కుల బహిష్కరణ పేరుతో గ్రామంలో శుభకార్యములకు తమని పిలవడం లేదన్నారు. ఎవరిని తమకు సహాయ సహకారాలు అందించకుండా గ్రామ పెద్దలు నిర్ణయించారని ఆరోపించారు. ఎవరైనా తమకు సహాయం అందిస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గ్రామంలో ఏ పనికి పిలవడం లేదని, ఆఖరికి తమ కుటుంబం లో ఓ మహిళ మృతి చెందితే కడసారి చూపుకు కూడా ఎవరూ రాలేదని దహన సంస్కారాలకు వేరే గ్రామం నుంచి కొందరు వస్తే వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారని బాధితులు వాపోతున్నారు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెడుతూ మానసిక క్షోభ కు గురి చేస్తున్నారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి