RS Praveen Kumar: క్లారిటీ ఇచ్చేశారు.. జనరల్‌ సీటు నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడి పోటీ..

|

Jun 17, 2023 | 5:54 PM

అక్కడ.. కాదు కాదు ఇక్కడ.. లేదు లేదు ఆయన పోటీచేసేదెక్కడో. నిన్న మొన్నటిదాకా ఆయన పార్టీలో, అనుచరుల్లో ఇదే టెన్షన్. ఇక్కడినుంచని అక్కడినుంచని అనుచరులు ఒత్తిడి తెస్తున్నా ఆయన మాత్రం జనరల్ సీటు నుంచే తొడగొట్టాలనుకుంటున్నారు. ఓటూ మీదే నోటూ మీదే.. సవారీ చేసే ఛాన్సూ మీదేనని పిలుపునిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు అక్కడ్నించే పోటీ చేయాలనుకుంటున్నారు?

RS Praveen Kumar: క్లారిటీ ఇచ్చేశారు.. జనరల్‌ సీటు నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడి పోటీ..
Rs Praveen Kumar
Follow us on

రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు. బహుజన రాజ్య స్థాపనే లక్ష్యమంటూ ముందుకెళ్తున్న మాజీ ఐపీఎస్‌. దళిత బహుజన ఓటు బ్యాంకే లక్ష్యంగా బీఎస్పీని విస్తరించి తెలంగాణలో నీలి జెండా ఎగరేయాలనుకుంటున్నారు ఆర్‌ఎస్పీ. వచ్చే ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేసే స్థానంపై రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజంలో తీవ్ర చర్చే జరుగుతోంది. ఆయన మా నియోజక‌వర్గం నుంచి పోటీచేస్తారంటే లేదు లేదు మా నియోజకవర్గం నుంచంటూ అనుచరగణం కొన్నాళ్లుగా హడావుడిచేస్తున్నా.. చివరికి జనరల్‌ సీటునుంచే పోటీకి ఫిక్సయ్యారట ఆర్‌ఎస్పీ.

రిజర్వుడ్‌ సీటునుంచి కాకుండా జనరల్‌ సీటనుంచి గెలిస్తే ఆ కిక్కే వేరనుకుంటున్నారట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. అందుకు తగ్గట్టే మారుమూలన ఉన్న నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారట. ఇక్కడ్నించి పోటీ చేస్తేనే రాష్ట్ర రాజకీయాలను శాసించగలం అనుకుంటున్నారట ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌. కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంనుంచి పోటీకే ఆయన ఫిక్స్‌ అయ్యారంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప టార్గెట్‌గా పక్కా ప్లాన్‌తో ఎన్నికల బరిలోకి‌ దిగాలని ఫిక్స్ అయ్యారట ప్రవీణ్‌కుమార్‌. సిర్పూర్‌లో ఆయన పర్యటనలు ముమ్మరం చేయటంతో పోటీ ఎక్కడినుంచన్న ఉత్కంఠకి తెరపడింది.

బెజ్జూర్ మండలంలో పర్యటించిన ఆర్‌ఎస్పీ అభిమానులు కోరుకుంటే.. నియోజకవర్గ ప్రజలు అండగా నిలిస్తే ఇక్కడి నుంచే పోటీచేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. 2014లో సిర్పూర్- -టి నియోజకవర్గంలో బీఎస్పీనుంచి పోటీచేసి గెలిచారు కోనేరు కోనప్ప. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి నియోజకవర్గంలో పట్టుసాధించారు. అయితే బహుజన ఓటర్ల మద్దతుతో గెలిచాక వారి సంక్షేమాన్ని కోనప్ప పట్టించుకోలేదని.. అందుకే బలమైన నేతను ఓడిస్తేనే బహుజన లక్ష్యం నెరవేరినట్లని భావిస్తున్నారట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కోనేరు‌ అవినీతి కొండను‌ బద్దలు కొట్టే ఏనుగును నేనే అంటూ విరుచుకుపడుతున్నారాయన. మరి బీఎస్పీ నేత ఆర్ఎస్పీకి సిర్పూర్ సలాం కొడుతుందా.. లేక అంచనాలను తలకిందులు చేస్తుందోగాని.. బీఎస్పీ అధినేత వ్యూహంపై బహుజనుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..