Khammam Politics: పొంగులేటి వర్గంపై బీఆర్‌ఎస్ బహిష్కరణ అస్త్రం.. 20 మంది నాయకులపై వేటు..
ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్సెస్ బీఆర్‌ఎస్‌గా మారింది. బీఆర్‌ఎస్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి, ఆత్మీయ సమ్మేళనాలతో పొలిటికల్ హీట్ రేపుతున్నారు.
ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్సెస్ బీఆర్‌ఎస్‌గా మారింది. బీఆర్‌ఎస్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి, ఆత్మీయ సమ్మేళనాలతో పొలిటికల్ హీట్ రేపుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం మరింత ముదరడంతో బీఆర్‌ఎస్ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. పార్టీలో ఉంటూ పొంగులేటి వెంట ఉన్న నేతలపై యాక్షన్ షురూ చేసింది. పొంగులేటి వర్గంపై బీఆర్‌ఎస్ బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. ఖమ్మంజిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది ముఖ్య నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్ అధిష్ఠానం ప్రకటించింది. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్‌తో పాటు మరో 18 మందిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, బీఆర్‌ఎస్ అధిష్ఠానికి మధ్య పొసగడం లేదు. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్న పొంగులేటి..పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 5 మండలాల నేతలతో సమావేశమయ్యారు. పలువురు ముఖ్యనేతలు, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం సీరియస్ అయ్యింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటించింది.
ఇదిలాఉంటే.. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలతో ఎన్నికలకు ముందే పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఖమ్మం నగరం సహా పినపాక, ఇల్లందు, మధిర నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
తాజాగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెంజిల్లా పరిధిలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ జారే ఆదినారాయణ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..