ఆదివారం, గురువారం వస్తుందంటే వణికిపోతున్న ఊరి జనం.. అంతుచిక్కని పూజలతో భయం భయం!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజల ఆనవాళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం, గురువారం, అమావాస్య రోజులు వచ్చాయంటే చాలు పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు రహదారులు, కూడళ్లు, పొలాల గట్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లు, ఎండుమిర్చి వంటి వస్తువులను ఉంచి పూజలు చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తుండటంతో స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉంచడంతో పాటు నాటుకోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయి. ఉదయాన్నే ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇదే తరహా ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లోనూ వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్దపల్లి మండలంలోని ఓ గ్రామ శివారులో చెట్టుకు బొమ్మను కట్టి, చుట్టూ పసుపు, కుంకుమ చల్లి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాలు, మంథని పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలు, వ్యవసాయ పొలాల గట్ల వద్ద కూడా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ముఖ్యంగా అమావాస్య రాత్రులు, ఆదివారాలు, గురువారాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ప్రచారం గ్రామాల్లో భయాందోళనలకు కారణమవుతోంది. తెల్లవారుజామున రహదారులపై కనిపిస్తున్న పూజా సామగ్రిని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైతులు సైతం రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
మూఢనమ్మకాల పేరుతో ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని కోరుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..