Chor Bazaar: చోర్ బజార్‌లో దొరికే బ్రాండెడ్ వస్తువులు దొంగతనం చేసినవేనా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Chor Bazaar: చోర్ బజార్‌లో అసలు దొంగతనం చేసిన వస్తువులు లేకపోయినా, ఈ పేరు ఎలా వచ్చిందో గమనించాలి. ఈ ప్రచారాన్ని వ్యాప్తి చేసింది ఫుట్‌పాత్ లాంటి వ్యాపారులే. ఒక కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకుంటే ఇది స్పష్టమవుతుంది. ఇది ఈ-కామర్స్ రిటర్న్, చిన్న డ్యామేజ్..

Chor Bazaar: మన భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రధాన నగరంలో ఆదివారం ఉదయం కళకళలాడే మార్కెట్‌లు కనిపిస్తాయి. వీటిని సాధారణంగా “చోర్ బజార్” అని పిలుస్తారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ లేదా జుమేరాత్ బజార్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ బ్రాండెడ్ వస్తువులు మార్కెట్ ధరలో సగానికి లేదా అంతకంటే తక్కువకు లభిస్తుండటంతో చాలామంది ఇవి దొంగతనం చేసిన వస్తువులే అని భావిస్తారు. అయితే ఇది కేలం ప్రచారం మాత్రమేనని చెబుతుంటారు. ఈ మార్కెట్‌ల వెనుక వందల కోట్ల రూపాయల విలువైన ఒక అద్భుతమైన సరఫరా గొలుసు, రివర్స్ లాజిస్టిక్స్, ఆర్థిక సూత్రాలు పనిచేస్తున్నాయి.
వస్తువులు ఎక్కడి నుండి వస్తాయి? దొంగసొత్తు కాదు!
చోర్ బజార్‌లో వస్తువులు ప్రధానంగా నాలుగు చట్టబద్ధమైన మార్గాల నుండి వస్తాయి. కానీ వాటికి “దొంగసొత్తు” అనే ముద్ర పడిపోయింది.
1. ఈ-కామర్స్ రిటర్న్‌లు (లిక్విడేషన్ లాట్స్): మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి, సైజు సరిపోకనో, నచ్చకనో తిరిగి ఇచ్చే వస్తువులు కంపెనీలకు పెద్ద సమస్య. ఆ వస్తువులను తిరిగి ప్రధాన గోదాములకు తీసుకెళ్లి, తనిఖీ చేసి, రీప్యాక్ చేసి అమ్మడం ఖర్చుతో కూడుకున్న పని. చాలా సందర్భాలలో ప్యాకేజింగ్ దెబ్బతిన్నా లేదా వస్తువు కొద్దిగా డ్యామేజ్ అయినా, కంపెనీలు వాటిని మళ్ళీ కొత్తవిగా అమ్మలేవు. అటువంటి వస్తువులన్నింటినీ కంపెనీలు పెద్ద లాట్‌లుగా చేసి, “స్క్రాప్” కింద కేజీల లెక్కన అమ్ముతాయి. ఈ లాట్‌లలో అమెజాన్ వేర్‌హౌస్‌లో మిగిలిపోయిన స్టాక్, దెబ్బతిన్న ప్యాకింగ్ ఉన్న వస్తువులు, అడ్రస్ దొరకనివి కూడా ఉంటాయి. వీటిని సలీం భాయ్ వంటి పెద్ద హోల్‌సేలర్లు కొనుగోలు చేస్తారు.
2. కస్టమ్స్ వేలం: విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్ లేదా బట్టల కంటైనర్‌లకు దిగుమతిదారులు పన్నులు చెల్లించలేనప్పుడు, ఆ కంటైనర్‌లు పోర్టులోనే నిలిచిపోతాయి. కొన్ని నెలల తర్వాత కస్టమ్స్ అధికారులు వాటిని బహిరంగ వేలంలో విక్రయిస్తారు. ఈ వేలంలో కూడా సలీం భాయ్ వంటి వ్యాపారులు పాల్గొంటారు.
3. బీమా సాల్వేజ్: ఏదైనా బట్టల కర్మాగారంలో లేదా గోదాంలో అగ్నిప్రమాదం సంభవించినా, వరదలు వచ్చినా, బీమా కంపెనీలు యజమానికి నష్టపరిహారం చెల్లిస్తాయి. ఆ తర్వాత ఆ గోదాంలో మిగిలిన సరుకు బీమా కంపెనీల అధీనంలోకి వస్తుంది. వారు వాటిని స్క్రాప్‌గా వేలం వేస్తారు. అగ్నిప్రమాదంలో కింద ఉన్న వస్తువులు పాడైనా, పైన ఉన్న బ్రాండెడ్ బట్టలు తరచుగా సురక్షితంగా ఉంటాయి.
4. ఫ్యాక్టరీ, హోటల్ లిక్విడేషన్స్: మూసివేసిన ఎగుమతి కర్మాగారాల నుండి మిగిలిపోయిన స్టాక్, అలాగే స్టార్ హోటల్స్ రెండు, మూడేళ్లకు ఒకసారి తమ పాత ప్లేట్లు, స్పూన్లు, ఫర్నిచర్ వంటి వాటిని మార్చినప్పుడు కేజీల లెక్కన అమ్ముతారు.
వ్యాపార చక్రం: రమేష్ నుండి సలీం భాయ్ వరకు..
ఈ వ్యవస్థలో రెండు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. ఫుట్‌పాత్ వ్యాపారి, హోల్‌సేలర్. తెల్లవారుజామునే ఫుట్‌పాత్ వ్యాపారి తన సరుకుతో వచ్చి, సాయంత్రం ఎండరాకముందే అమ్మకాలు పూర్తి చేయాలని చూస్తాడు. అతని పెట్టుబడి కేవలం 15,000 రూపాయలు. సరుకు అమ్మడుపోకపోతే అతని పెట్టుబడి బ్లాక్ అవుతుంది. హై ఇన్వెంటరీ టర్నోవర్ అతని వ్యాపార నమూనాకు కీలకం.
ఇక హోల్‌సేలర్. ఈ వ్యాపారంలో కీలకమైన వ్యక్తి. అతను సింగిల్ పీస్‌లు కొనడు. ట్రక్కుల కొద్దీ సరుకును కేజీల లెక్కన కొంటాడు. ఉదాహరణకు అతను ఆన్‌లైన్ రిటర్న్‌ల నుండి వెయ్యి కేజీల లాట్‌ను 200 రూపాయల చొప్పున మొత్తం 2 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. రవాణా, లేబర్ ఖర్చులతో కలిపి మొత్తం పెట్టుబడి 2,20,000 అవుతుంది. ఇక్కడ పెద్ద రిస్క్ ఏంటంటే లాట్ కొనేటప్పుడు లోపల ఏముందో చెక్ చేసే అవకాశం ఉండదు. ఇది ఒక లాటరీ వంటిది.
గోదాంలోకి సరుకు వచ్చాక, హోల్‌సేలర్ వ్యాపారి దానిని గ్రేడింగ్ చేస్తాడు:
- గ్రేడ్ A: బ్రాండ్ న్యూ, షోరూమ్ ట్యాగ్‌లతో ఉన్న వస్తువులు (రమేష్ లాంటి వారికి ఒక్కో పీస్ 600కి అమ్ముతాడు).
- గ్రేడ్ B: జిప్ పోయినవి, చిన్న మచ్చలు ఉన్నవి, డ్యామేజ్ అయిన బాక్స్ లలో ఉన్నవి (ఒక్కో పీస్ 400కి అమ్ముతాడు).
- గ్రేడ్ C: పూర్తిగా పాడైనవి, జతల లేనివి (రీసైక్లింగ్ షాపులకు స్క్రాప్‌గా అమ్ముతాడు).
- ఈ వ్యాపారంలో తక్కువ లాభం వచ్చినా, నెలలో అనేక లాట్‌లను రొటేట్ చేయడం ద్వారా (ఫైనాన్షియల్ వెలాసిటీ) హోల్‌సేలర్ లక్షల్లో సంపాదిస్తాడు.
ఇది కూడా చదవండి: Golconda Fort Secrets: కోహినూర్ వజ్రం నుంచి కోట పతనం వరకు.. గోల్కొండ కోట చరిత్రలో దాగిన ఆసక్తికర రహస్యాలు!
మార్కెటింగ్ వ్యూహం:
చోర్ బజార్‌లో అసలు దొంగతనం చేసిన వస్తువులు లేకపోయినా, ఈ పేరు ఎలా వచ్చిందో గమనించాలి. ఈ ప్రచారాన్ని వ్యాప్తి చేసింది ఫుట్‌పాత్ లాంటి వ్యాపారులే. ఒక కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకుంటే ఇది స్పష్టమవుతుంది. ఇది ఈ-కామర్స్ రిటర్న్, చిన్న డ్యామేజ్ ఉంది అని చెబితే వినియోగదారుడు ఆ వస్తువును తక్కువగా చూస్తాడు. అదే “అన్నా, ఇది నిన్ననే పెద్ద షోరూం నుండి ఎత్తేశాం, పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. త్వరగా తీసుకెళ్లు అని చెబితే, కస్టమర్‌కు ఇది 15,000 విలువైన బ్రాండెడ్ వస్తువు, తక్కువకు దొరికిందని ఒక ఫాల్స్ ప్రైడ్ వస్తుంది. వారిలోని అత్యాశను క్యాష్ చేసుకోవడమే ఈ “దొంగతనం” కథ ప్రధాన ఉద్దేశం. ఈ అబద్ధమే చోర్ బజార్‌కు అసలైన మార్కెటింగ్ వ్యూహం.
జాగ్రత్తలు:
అయితే, ఈ మార్కెట్‌లో కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. “10,000కు ఐఫోన్” అని చెప్పి, బాక్స్‌లో సబ్బు బిళ్ళ లేదా రాయి పెట్టి అమ్మేస్తుంటారు. ఒకవేళ నిజంగా ఐఫోన్ ఉన్నా అది దొంగిలించినదై, బ్లాక్ చేయబడి ఉండవచ్చు. అందులో సిమ్ వేసిన వెంటనే మీరు పోలీసుల రాడార్‌లోకి వెళ్ళిపోతారు. అందుకే ఎలక్ట్రానిక్స్ వంటివి కొనేటప్పుడు వందలసార్లు ఆలోచించాలి. చోర్ బజార్ అనేది దొంగతనం చేసిన వస్తువుల బజార్ కాదు. ఒక కార్పొరేట్ కంపెనీలకు నష్టంగా మారిన వస్తువులు, స్థానిక మార్కెట్‌లో ఒక అద్భుతమైన వ్యాపారంగా రూపాంతరం చెందే ఒక సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థ. ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు, సగం రేటుకి దొరకదు. ప్రతి వస్తువు వెనుక ఒక పెద్ద సరఫరా గొలుసు. ఆర్థిక చక్రం నడుస్తూనే ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
