మరో రెండు రోజుల్లో పెళ్లి.. కాబోయే పెళ్లికొడుకు మింగేసిన రోడ్డు ప్రమాదం!
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుంకిమెట్ల నుంచి కోస్గి వెళ్లే మార్గంలో కారు, ఆటో ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. తుంకిమెట్ల నుంచి కోస్గి వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకరు, ఆటోలో ప్రయాణిస్తున్న మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన శ్రీశైలం అనే వ్యక్తికి మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన లగచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా మృత్యుఘోష వినిపించింది. పెళ్లి వేడుకలతో సందడిగా ఉండాల్సిన కుటుంబంలో విషాదం అలుముకుంది. శ్రీశైలం మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో లగచర్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..