తెలంగాణలో ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియతో పాటూ పరిశీలన కూడా పూర్తి చేశారు అధికారులు. ఇక ప్రచారంలో జోరందుకున్నాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైంది. దీని కోసం కార్యాచరణం రచిస్తోంది. మ్యానిఫెస్టో కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన వాటికంటే కూడా భిన్నంగా మ్యానిఫెస్టోని విడుదల చేయాలని భావిస్తున్నారు కాషాయ పెద్దలు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువకులులతో పాటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలను కలుపుకొని పోయేలా సరికొత్త మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా ఫుల్ మీల్స్ లాంటి మ్యానిఫెస్టోను రూపొందించి కేంద్ర మంత్రి అమిత్ షాకి అందించనున్నారు. దీనిని ఆయన పరిశీలించిన తరువాత ముసాయిదాను కూడా మరోసారి పరిశీలించనున్నారు. పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చాక మ్యానిఫెస్టోని విడుదల చేయడం కమలం పార్టీకి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 17న అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అప్పుడే ఈ మ్యానిఫెస్టోని విడుదల చేయాలని భావిస్తోంది బీజేపీ. దీంతో పాటూ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ చేయలేని పనిని బీజేపీ చేస్తోంది. ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇస్తోంది. దీనికోసం బీసీలందరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. అలాగే సెంటిమెంట్‌ను రగిలించాలని భావిస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..