Telangana BJP: కమలం పార్టీలో కాక పుట్టిస్తోన్న ఆ ప్రచారం.. మాజీ ఎంపీ ఇంట్లో రహస్య సమావేశం అందుకేనా..!

|

Jun 11, 2023 | 9:07 PM

Telangana BJP News: తెలంగాణ బీజేపీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అధ్యక్ష పదవి మార్పు అంశం తెరపైకి వచ్చాక సమీకరణాలు వేగంగా కదులుతున్నాయి. ఈటెల రాజేందర్‌కు పదవి ఖాయం అనే వార్తలను వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో బ్యాచ్ తెరవెనుక సమావేశాలు మొదలు పెట్టడం ఆసక్తిగా మారింది.

Telangana BJP: కమలం పార్టీలో కాక పుట్టిస్తోన్న ఆ ప్రచారం.. మాజీ ఎంపీ ఇంట్లో రహస్య సమావేశం అందుకేనా..!
Telangana BJP
Follow us on

Telangana BJP News: తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటే.. ఇప్పుడు బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవి మార్పుకు అనుకూల వర్గం ఒక వైపు, వ్యతిరేక వర్గం మరో వైపు మీటింగ్స్ పెట్టడం కమలం పార్టీలో కాక పుట్టిస్తోంది. ఇప్పటికే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈటెల రాజేందర్ చక్కర్లు కొట్టడం, ఆయనకు పదవి ఖాయం అంటూ సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పు వ్యతిరేక బ్యాచ్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో సమావేశం అవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, బూర నర్సయ్యగౌడ్‌, ఇతర నేతలు హాజరయ్యారు.

అసలు అధ్యక్ష పదవిమార్పు అంటే బీజేపీలో అంత ఆషామాషీ కాదని, అసలు అవసరం ఏముందన్నది జితేందర్‌రెడ్డి బ్యాచ్ వాదన. తమ పార్టీ ఇంటర్నల్‌ విషయాలపై చర్చించామన్నారు జితేందర్‌రెడ్డి. సీఎం కేసీఆర్‌ రోజుకో లీక్‌ ఇస్తూ.. బీజేపీ క్యాడర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కోలేకే కేసీఆర్‌ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు జితేందర్‌రెడ్డి. పొంగులేటి, జూపల్లి ఎంతో అనుభవం ఉన్న నేతలని, వాళ్లిద్దరూ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఢీకొట్టాలంటే బీజేపీతోనే సాధ్యమని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని నేతలు అభిప్రాయపడినట్లు చెప్పుకొచ్చారు.

టీ-బీజేపీలో జరుగుతున్న పరిణామాలతోపాటు పార్టీ బలోపేతంపై చర్చించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఢిల్లీ వరకూ ఈ విషయాలపై వెళ్లాల్సిన అవసరం లేదని, రాష్ట్ర నాయకత్వంలోనే చర్చించుకుని పరిష్కారం చేసుకుంటామన్నారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో పార్టీలో అంతర్గత పోరు నెలకొని ఉండటం.. ఇప్పుడు కాషాయ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..