vijayashanti on ktr: అన్యాయం ఎక్కడ జరిగితే.. రాములమ్మ అక్కడ ఉంటుందని.. ప్రజల పక్షాన నిలబడతానని బీజేపీ నేత విజయశాంతి తెలిపారు. సాగర్ బైపోల్‌లో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో విజయశాంతి చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా టీవీ9కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఉరుకునేదిలేదని ఆమె తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ మద్యం మత్తులో ముంచుతున్నారని మండిపడ్డారు. డబ్బు, మద్యంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. మత్తులో నుంచి తెలంగాణ బిడ్డలను కాపాడుకోవల్సిన అవసరముందన్నారు.
మరోవైపు, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. ఇవాళ వరంగల్ పర్యటనలో మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కారుకూతలు కూస్తే.. ఇష్టమొచ్చినట్లు ట్వీట్ చేస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాని తాము కూడా టార్గెట్ చేయగలమన్నారు.
కాగా, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి ఘాటుగానే స్పందించారు. పిల్ల కాకి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. కేటీఆర్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జాతీయ పార్టీ బీజేపీని విమర్శించే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. సీఎం కేసీఆర్ సవాల్‌కు మాత్రమే నేను స్పందిస్తానని విజయశాంతి స్పష్టం చేశారు. ఈనెల 17న జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, సాగర్‌లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ఇటీవల కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఒకవైపు అరాచకం… మరోవైపు ప్రజల దైన్య స్థితిలో ఉందని పరిపాలన పూర్తిగా పక్కదారి పట్టిందని ఆమె ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ పార్టీలకు సంబంధించిన తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై ఫైరయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.