Telangan: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీసమేతంగా ఈరోజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజీపీ అధికారంలోకి వచ్చితీరుతుందన్నారు. మునుగోడు ఉపఎన్నికతో కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు అంతం చేయాలన్నారు. ప్రజలంతా కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం వచ్చే ఎన్నిక అన్నారు. రాష్ట్రంలో 12 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. సీఏం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని తాను మునుగోడు ప్రజలను కోరుతున్నాని పేర్కొన్నారు. తాను నిజాయితీగా బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెప్పారు. మునుగోడు ప్రజలే నా దేవుళ్లు, వాళ్ల తీర్పును శిరసా వహిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తీరును తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఆపార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగష్టు 21వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయినప్పటికి ప్రధాన పార్టీలన్ని మునుగోడుపై ఫోకస్ పెంచాయి. ఉప ఎన్నిక వస్తే బీజేపీ అభ్యర్థిగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. ఇక అధికార టిఆర్ ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కూడా ఈరోజు, రేపట్లో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటూ.. వారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు రాజగోపాల్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..