
బీఆర్ఎస్ అధిష్టానంపై విమర్శలు గుప్పించి సస్పెండ్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఏ పార్టీలో చేరబోతున్నారు.. చేరితే ఈ ఇద్దరి నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతోంది..? జాతీయ పార్టీలో చేరుతారా..? ఇద్దరు నేతలకు మరేదైనా వ్యూహం ఉందా..? అనే విషయాలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ తరుణంలో.. బీఆర్‌ఎస్ నుంచి వేటు పడ్డ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీజేపీ గాలం వేస్తోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. స్వయంగా జూపల్లి కృష్ణారావుకి ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు అరుణ. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చారు జూపల్లి కృష్ణారావు. కార్యకర్తలతో సంప్రదించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని స్పష్టంచేశారు.
కాగా, డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరిదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఒకే జిల్లా అయినప్పటికీ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడిచేది. ఎడముఖం పెడముఖంగా ఉండేవారు. జిల్లాలోనూ పార్టీలోనూ ఆధిపత్యం కోసం అనేక ఎత్తుగడలు హీట్ పుట్టించేవి. మారిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరితే.. జూపల్లి కృష్ణారావు గులాబీ గూటికి చేరుకున్నారు.
గత ఎన్నికల్లో డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ ఓడిపోయారు. అరుణ బీజేపీలోనే కొనసాగుతుండగా.. గులాబీ పార్టీలో జూపల్లికి ఎదురుగాలి వీచింది. ఇప్పుడు పార్టీ వేటు వేయడంతో.. ఈ మాజీ మంత్రిపై బీజేపీ దృష్టి పడింది. పాత అంశాలను పక్కన పెట్టారో… కలిసి సాగాలని అనుకున్నారో.. లేక పార్టీ ఆదేశాలో కానీ.. జూపల్లికి డీకే అరుణ ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..