
ఖమ్మం గుమ్మంలో నిర్వహించే సభపై బీజేపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఈ సభ టర్నింగ్ పాయింట్‌గా ఉండాలని లెక్కలేసుకుంటోంది. జిల్లాలో పార్టీ ఉనికి లేదు.. కనీస స్థాయిలోనైనా కార్యకర్తలు లేరన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఎక్కడైతే ఆదరణ లేదన్న ఆరోపణలు ఉన్నాయో.. అక్కడే లక్షమందితో సభ నిర్వహించి కమలం తడాఖా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సభతో మొదలుపెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది.
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రతో పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. కాంగ్రెస్‌తో పోలిస్తే గ్రాఫ్ పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత నిరుద్యోగుల తరఫున నిరసనలు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఆందోళనతో నేతలు జనం బాటపట్టారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో.. కర్నాటకలో ఎన్నికలతో నేతలంతా అక్కడ మకాం వేశారు. దీంతో తెలంగాణలో యాక్టివిటీ తగ్గింది. అదే సమయంలో అక్కడ బీజేపీ పరాజయంతో.. ఇక్కడ పార్టీ కార్యకలాపాలు ఒక్కసారిగా అగిపోయాయి.
నిజానికి కర్నాటక రిజల్ట్‌తో పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా అధ్యక్షుడ్ని మారుస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వీటన్నింటికి ఖమ్మం సభతో చెక్ పెట్టాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో అగ్రనేతల పర్యటనలు వరుసగా ఉండేలా ప్లాన్ చేసినట్టు స్పష్టమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..