Big News Big Debate: అధికార మార్పిడి జరిగి వారమైనా తిరగకముందే కూల్చివేతకు కుట్ర అంటూ రాజకీయరచ్చ మొదలైంది. రాజాసింగ్‌తో మొదలై.. కడియం, పల్లా, సుధీర్‌రెడ్డి దాకా ఎవరికి వారు సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. ఈ రచ్చ నడుస్తుండగానే తాజాగా పథకాల అమలుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య కొత్త చిచ్చు పెట్టాయి. అమలు కానీ హామీలిచ్చిన హస్తం పార్టీకి అసలు ఆట మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అంటే.. అమలు చేసి చూపిస్తామని మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక పగ-ప్రతీకార రాజకీయాలపైనా హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.. రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఎలా అమలు చేస్తుందో చూస్తామన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీకి, చెప్పిన ప్రతీ మాటకు రికార్డులున్నాయని.. తామెందుకు వదిలిపెడతామంటూ వార్నింగ్ పంపారు. మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామన్న భరోసా ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు బరువు తెలుస్తుంది.. అసలు ఆట ఇప్పుడే మొదలైందన్నారు కేటీఆర్.. అటు గోబెల్ ప్రచారంతో కాంగ్రెస్ గెలిచిందని, పనిమంతులు ఎవరో త్వరలో ప్రజలకు అర్ధమవుతుందన్నారు మరో మాజీ మంత్రి హరీష్‌రావు.
అధికారం పోయిందన్న బాధతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రులు. ప్రతి హామీ అమలు చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్రంలో BRS-MIM- BJP కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కుట్రలకు తెరతీస్తున్నాయని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త సర్కార్ ఏర్పాటై వారం కూడా గడవకముందే కూలుతుందని ప్రచారం వెనక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి. అటు గత ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతిపైనా సమీక్షలు చేస్తున్నామని పీసీసీ అంటోంది.
పగ- ప్రతీకారం పేరుతో కేసులు పెడితే సహించేది లేదన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. కేసీఆర్ కూడా పగతో పాలన సాగించి ఉంటే సగం మంది జైల్లోనే ఉండేవారన్నారు మంత్రి.
మొత్తానికి కేటీఆర్- హరీష్ ద్వయం ప్రభుత్వం దాడి మొదలుపెట్టింది. అంతేస్థాయిలో సర్కార్ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. వారంలోనే ఈ స్థాయిలో అధికార-విపక్షాల మధ్య మాటలతూటాలు పేలడం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..