
తెలంగాణలో ఎన్నికల కాక మొదలైంది. నేటినుంచి ప్రధానపార్టీలు ఎన్నికల కదనరంగంలోకి దూకుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతల సభలతో ఇవాళ తెలంగాణ మోతెక్కనుంది. హైదరాబాద్‌లో అమిత్, రేవంత్ సభలు నిర్వహిస్తుండగా.. కరీంనగర్‌లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. బూత్‌లెవల్ కార్యకర్తలతో LB స్టేడియంలో అమిత్‌షా మీటింగ్ నిర్వహించనుండగా.. పరేడ్ గ్రౌండ్స్‌లో డ్వాక్రా సంఘాలతో సీఎం రేవంత్ సభ నిర్వహించనున్నారు. కరీంనగర్‌లో కేసీఆర్ కదనభేరి సభలో పాల్గొననున్నారు.
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 17మంది పార్లమెంట్ స్థానాల్లో 10స్థానాలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో కేంద్ర హోం అమిత్‌షా పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులతో బిజీబిజీగా షా గడపబోతున్నారు. బీజేపీ స్ట్రాటజీ అమలు చేసేలా.. బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్, ముఖ్యనేతలతో సమావేశమవుతారు షా. హైదరాబాద్ కు అమిత్ షా.. మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకోనున్నారు. 1.45 నుంచి 2.45 వరకూ సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమవుతారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే బిజేపి బూత్ లేవల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యహ్నం 3.15 గంటలకు విజయ్ సంకల్ప్ సమ్మెళనం పేరుతో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హజరుకానున్నారు. సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు బిజేపి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న నెలన్నరపాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తారు. ఈనెల 15 తర్వాత ప్రధాని మోడీ సౌతిండియా టూర్ రానున్న నేపథ్యంలో తెలంగాణలో మూడు భారీ బహిరంగ సభలకు బిజెపి ప్లాన్ చేస్తోంది. మోదీ సభలపై అమిత్ షా టూర్‌లో రచ్చకు వచ్చే అవకాశం ఉంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరు హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్షమంది మహిళలతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళాశక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవాళ జరిగే మహిళా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని సున్నా వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తుంది. ఇకపై ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్‌మెంట్ చేయనుంది.
పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేటినుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. దీనికోసం ప్రచారానికి సన్నద్ధం అవుతుంది. బీఆర్ఎస్‌కి సెంటిమెంట్‌గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ . ఇవాళ కరీంనగర్‌లోని SRR కాలేజీలో జరిగే కధనభేరి సభకి హాజరువుతున్నారు కేసీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు ప్రకటించారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మొట్టమొదటి ఎన్నికల సభ కావడంతో కేసీఆర్ ప్రసంగంపైనా ఆసక్తి నెలకొంది. కదనభేరి సభకోసం ఇప్పటికే కరీంనగర్‌ను జెండాలు, బ్యానర్లతో గులాబీమయం చేశారు పార్టీ శ్రేణులు. మొత్తానికి నేటినుంచి తెలంగాణలో ఎన్నికల వేడి మొదలుకానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..