
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర ప్రారంభించి తెలంగాణలో 12 రోజుల క్రితం అడుగు పెట్టారు. వివిధ గ్రామాలను సందర్శిస్తూ.. ప్రజల కష్టాల గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర ఈరోజుతో తెలంగాణాలో పూర్తి చేసుకుని.. రేపు మహారాష్ట్రలో అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పని చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ జెండానే కాదు భారతదేశం జెండాను ఎత్తుకున్నారు. తెలంగాణ గొంతు వినవలిసిందే.. దేశానికి నేర్పించే శక్తి ఉందన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రయివేటు కరణ చేస్తున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. అంతేకాదు అసలు తెలంగాణ ప్రజల కలలను నాశనం చేసింది కేసీఆర్ సర్కారు అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు రాహుల్.
ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో భూముల ఇచ్చిన ఘనత తమ సొంతమని.. యూపీఏ ప్రభుత్వం ట్రైబల్ బిల్లు పెట్టిందని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి ప్రభుత్వం దళితులకు, గిరిజనులు భూములు ఇవ్వకపోగా లాక్కువుంటుందంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే దళితులకు, గిరిజనులకు భూముల మీద హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రైతులు అసంతృప్తితో ఉన్నారు. వ్యవసాయం లాభదాయకంగా లేదని వాపోయారు. యూపీఏ హయాంలో 72వేల కోట్లు రుణ మాఫీ చేశాం..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణ మాఫీ చేస్తామని హామీనిచ్చారు. అన్ని పంటలకు మంచి మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తాం. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కమిషన్ గురించి ఆలోచిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కలిసి పని చేస్తున్నారని జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోడీ ఏ బిల్లు తెచ్చినా.. రైతు వ్యతిరేక చట్టాలకు టీఆరెస్ మద్దతు పలికిందన్నారు. బీజేపీ, టీఆరెస్ కలిసి పనీ చేస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
బడా వ్యాపారులు కోసం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేట్ చేస్తున్నారు. బీహెచ్ ఈఎల్, రైల్వే లు ప్రైవేటు చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా కుట్రలకు పాల్పడ్డారని కేంద్ర తీరుపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. దేశంలో యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు, ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ లో ఉద్యోగాలు లేవు.. నోట్ల రద్దు, జిఎస్టీ, ప్రైవేటు కరణలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. హింస, మతోన్మాదం, విద్వేషం, జిఎస్టీలకు వ్యతిరేకంగా తాను చేపట్టిన యాత్రకు శక్తిని ప్రజలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి నడుస్తూ.. అందరి నుంచి తాను చాలా నేర్చుకున్నానని .. ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు .. తాను తెలంగాణ లో చేసిన పాదయాత్రను ఇక్కడ ప్రజల ప్రేమను తాను మర్చిపోలేనన్నారు రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలో విజయవంతంగా ముగిసింది. గత నెల 23న తెలంగాణ లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ 24 నుంచి 26 వరకు విరామం తీసుకున్నారు. తిరిగి 27 నుంచి తిరిగి యాత్ర ప్రారంభించారు. అనంతరం నవంబర్ 4వ తేదీన మరోసారి యాత్ర కు విరామం ఇచ్చారు రాహుల్ గాంధీ. నవంబర్ 7వ తేదీన మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ జోడో యాత్ర ముగిసింది. ఈరోజు రాత్రి మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి యాత్ర ను అప్పగించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 375 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్ల యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి 10 కిలోమీటర్ల యాత్ర సాగింది. 19 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 7 పార్లమెంట్ నియోజక వర్గాలలో యాత్ర సాగింది. ప్రతి రోజు సాయంత్రం కార్నర్ సమావేశాలను నిర్వహించారు. హైదరాబాద్ లో నవంబర్, 1,2 తేదీలలో రాహుల్ పర్యటించారు. చారిత్రక చార్మినార్ వద్ద నుంచి నగరం నడిబొడ్డు నుంచి సాగిన రాహుల్ పాదయాత్ర..ప్రతి రోజు మధ్యాహ్నం సంఘాలతో సమావేశాలు.. వారి సమస్యలపై చర్చించారు. సామాజిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, జర్నలిస్టులు, రైతులు తదితరులతో సమావేశం అయ్యారు. పాదయాత్ర లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సమాజం నుంచి రాహుల్ కు సంపూర్ణ మద్దతులభించింది. దారి పొడవునా స్వచ్చందంగా పాల్గొన్న ప్రజలు రాహుల్ తో కరచనాలకు, ఫోటోలకు ప్రాధాన్యత ఇచ్చారు. పాదయాత్ర మధ్యలో పిల్లలతో రైతులతో, వృద్ధులతో, కార్మికులతో ఆగి మరి ఫోటోలు ఇచ్చారు రాహుల్. ఒకసారి క్రికెట్, ఒకసారి ఫుట్బాల్, లంబాడీ నృత్యాలు, బతుకమ్మలు ఆడిపాడి సందడి చేశారు. బతుకమ్మ లు, బోనాలు, సాగివసత్తులు లతో నిర్వాహకులు రాహుల్ గాందీకి స్వగతం పలికారు. పోతారాజులతో నృత్యం చేశారు. బహిరంగ సభలలో భారత్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రజలకు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..