Telangana: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. భారీ వర్షాలకు నీట మునిగిన బైంసా పట్టణం

|

Jul 10, 2022 | 7:03 AM

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లులు పడిందా అన్నట్లుగా వరుణుడు ఉగ్రరూపం దాల్చుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో భైంసా మునిగింది. జలదిగ్భందంలో చిక్కుకుంది....

Telangana: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. భారీ వర్షాలకు నీట మునిగిన బైంసా పట్టణం
Heavy Rains In Bhainsa
Follow us on

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లులు పడిందా అన్నట్లుగా వరుణుడు ఉగ్రరూపం దాల్చుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో భైంసా మునిగింది. జలదిగ్భందంలో చిక్కుకుంది. భారీవర్షానికి ఆరుగురు గల్లంతవగా అధికారులు అప్రమత్తమై వారిని కాపాడారు. నిర్మల్ జిల్లా బైంసాలో భారీవర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వర్షాలతో ఇళ్లు నీట మునిగాయి. బైంసా (Bhainsa) పట్టణమంతా వరద నీటితో ఎటుచూసినా చెరువును తలపించింది. పట్టణంలోని వినాయక్‌నగర్‌, రాహుల్‌నగర్‌, ఆటోనగర్‌, కుబీర్‌ చౌరస్తాలు నీటమునిగాయి. భైంసా వరదల్లో చిక్కుకున్న స్థానికులను రెస్క్యూ యంత్రాంగం కాపాడింది. సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారీ వర్షానికి మునిగిపోయిన బైంసా పట్టణంలో సహాయక చర్యలను కలెక్టర్ ముషారప్ అలీ స్వయంగా పరిశీలించారు. ఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో చిక్కుకున్న ఆరుగురి కోసం బాసర గోదావరి నుంచి మూడు నాటు పడవలను తెప్పించిన సేఫ్ గా కాపాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలుచోట్ల నీరు ఇండ్లలోకి ప్రవేశించింది.

కాగా నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో రికార్డుస్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో గత పదేళ్ల జులై నెలలో నమోదైన అత్యధిక వర్షపాతమిదే కావడం గమనార్హం. ఇంతకుముందు ఒకరోజు అత్యధిక వర్షపాతం 2013 జులై 19న రామగుండంలో 17.7 సెం.మీ.లు అని వాతావరణశాఖ తెలిపింది. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవగా పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.