Bhadrachalam: మూడు పంచాయతీలుగా భద్రాచలం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

|

Dec 18, 2022 | 7:20 AM

17 ఏళ్లుగా ఉన్న వివాదానికి తెరదించింది తెలంగాణ సర్కార్. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామాన్ని రెండు పంచాయతీలుగా, ఆసిఫాబాద్‌లో మరొక పంచాయతీని ఏర్పాటు చేసింది.

Bhadrachalam: మూడు పంచాయతీలుగా భద్రాచలం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
Bhadrachalam Temple
Follow us on

దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణాన్ని గతంలోనే నగర పంచాయతీ స్థాయి నుంచి మేజర్ గ్రామ పంచాయతీ స్థాయికి తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని మూడుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 70 వేలకు పైగా జనాభా ఉన్న భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీని మూడు గ్రామాలుగా విభజించడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఉన్న భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారాం నగర్, శాంతినగర్ పంచాయతీలుగా విభజిస్తూ జీవో జారీ చేసింది. పక్కనే ఉన్న సారపాక మేజర్ గ్రామ పంచాయతీని సైతం రెండు గ్రామ పంచాయతీలుగా విడదీస్తూ ఆదేశాలు జారీ చేసింది. సారపాక, ఐటీసీ నగర్లుగా విభజించింది.

ఇప్పటికే భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఎటపాక ప్రాంతం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోవడంతో భద్రాచలానికి చాలా నష్టం జరిగింది. భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామికి వెయ్యి ఎకరాల పైగా ఉన్న వ్యవసాయ భూమి ఉన్న గ్రామమైన పురుషోత్తం పట్నం ఎటపాక మండలంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ భూముల కౌలు నిర్వహణ విషయంలో ఆలయ యంత్రాంగం ఇబ్బందులు పాలవుతోంది. ఇదిలా ఉంటే 70 వేలకు పైగా జనాభాతో ఒక పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందిన భద్రాచలం గతంలో నగర పంచాయతీగా ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీన్ని మేజర్ గ్రామపంచాయతీగా డీగ్రేడ్ చేశారు.

అయినప్పటికీ 2018 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. గత నాలుగేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే కాలం గడుస్తూ ఉంది. భద్రాచలం పట్టణానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా భద్రాచలం పట్టణాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా విడగొడుతూ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ప్రభుత్వం ఆలోచన ఏంటన్నది అర్థం కావడం లేదని స్ధానికులు పేర్కొంటున్నారు. అయితే, పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు పంచాయతీలను విభజించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..