అటు అదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న పెద్ద పులులు.. ఇటు ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను షేక్ చేస్తున్నాయి.. తాజాగా మహబూబాబాద్ జిల్లా అడవుల్లో గాండ్రిస్తున్న పులి పాదముద్రల ఆధారంగా ఆ పులి కదలికలు పసిగట్టిన అటవీశాఖ సిబ్బంది పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. డప్పు దండోరా వేసి ఊర్లను అలర్ట్ చేశారు. ఆ పులి ఆడ పులి జాడ కోసం గాలిస్తున్నట్లు భావిస్తున్నారు. అది బెంగాల్ టైగర్ అని ఒక నిర్ధారణకు వచ్చారు..
ఏటా చలికాలంలో ఇక్కడికి తోడు కోసం వస్తూ అడవుల్లో సంచరిస్తున్నాయి పులులు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అభయరణ్యంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి కదలికలు పసిగట్టిన అటవీశాఖ సిబ్బంది ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ పులి కొత్తగూడ మండలంలోని కోనాపురం, ఓటాయి, కామారం, ఇటు నల్లబెల్లి మండలంలోని పరిసర అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి కదలికలను పసిగడుతున్న అటవీశాఖ సిబ్బంది పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు ఎవరు సమీప అడవుల్లోకి వెళ్ళవద్దని, రాత్రిపూట ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. డప్పు దండరా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అయితే ఈ పులి బెంగాల్ టైగర్‌గా భావిస్తోంది అటవీశాఖ సిబ్బంది. ఆడ పులి జాడ కోసం వాసన పసిగడుతూ సంచరిస్తుందని గుర్తించారు. రోజుకు 20 కిలోమీటర్ల మేర సంచరిస్తూ ఆడ పులి ఆచూకీ కోసం ఇటువైపు వచ్చిందని భావిస్తున్నారు. పులి కదలికలను బట్టి ఆడ పులి కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. గుంపులుగా ఉదయం పది గంటలు దాటిన తర్వాతనే పొలాలకు కానీ, అడవుల్లో కట్టెలకు గాని వెళ్లాలని, సాయంత్రం నాలుగు గంటలకల్లా తిరిగి వచ్చేయాలని సూచించారు.
వీడియో చూడండి..
అటవీశాఖ సిబ్బందిని వేటగాళ్ల భయం వెంటాడుతుంది. గతంలో కూడా ఒకసారి ఇదేవిధంగా వచ్చిన పులి వేటగాళ్ల ఉచ్చులకు బలైంది. ఇది కూడా వేటగాళ్ళ ఉచ్చులకు బలికాకుండా అటవీ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎవరైనా పులికి హాని తలపెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు పొలాల్లో పనిచేస్తున్నవారిపై వెనకనుండి పులి దాడిచేయకుండా.. వారికి మాస్క్‌లు పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..