ఆదివాసీల ఖిల్లా కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో ఇప్పటికి గోండు గూడాల బతుకులు మారడం లేదు. రోగమొచ్చిన రొప్పొచ్చినా.. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితొచ్చినా ప్రమాదకర ప్రయాణాలు చేయక తప్పడం లేదు. రోడ్డు రవాణా సదుపాయం లేక వరదలతో వాగులు ఉప్పొంగి.. వాగులు దాటే దారి లేక నరకం చూడక తప్పడం లేదు. ప్రాణాలు కాపాడాలంటే బాహుబలి ఫీట్లు వేయక తప్పడం లేదు. చిన్నారులైనా వృద్దులైనా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడిలోతు నీళ్లలో వరద ప్రవాహాంలో దేవుడుపై భారం వేసి ప్రయాణం సాగించక తప్పడం లేదు. అదృష్టం బాగుంటే ఒడ్డుకు లేదంటే అదే వరదలో గంగొడ్డుకు అన్న విధంగా దుర్బరంగా సాగుతున్నాయి ఈ జిల్లాలోని ఆదివాసీ గోండు గూడల బతుకులు. నడిచేందుకు సరైన దారి లేక వాగు దాటేందుకు వంతెనలు కానరాక కారడివిలో కట్టెకాలే వరకు కనీస సౌకర్యాలకు నోచుకోక బ్రతుకు జీవుడా అంటూ సాగక తప్పడం లేదంటోంది అక్కడి ఆదివాసీ యువత.
కొమురంభీం జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్ ఆదివాసీ గ్రామం ఇదే కోవవకు చెందుతోంది. వర్షకాలం వచ్చిదంటే చాలు ఇక్కడి వాగు ఉప్పొంగి ఊరును జలదిగ్బందం చేస్తోంది. బాహ్య ప్రపంచంతో బంధాలు సంబంధాలను దూరం చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఊరు దాటాలంటే ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు దాటక తప్పదు. తాజాగా మాలోత్ లక్ష్మణ్ అనే రైతు పత్తి పంటకు మందు పిచికారి చేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. స్పందించిన స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించేందుకు ఉదృతిగా ప్రవాహిస్తున్న వాగులో అతి కష్టం మీద.. మంచం పై మోసుకెళ్లారు. ఈ ఒక్క ఘటనే కాదు కేవలం నెల రోజుల వ్యవదిలో ఇదే వాగు వద్ద ఇలాంటి సీన్లే రిఫీట్ అయ్యాయి.
మూడు రోజుల క్రితం జాదవ్ కృష్ణ, సుజాత దంపతుల రెండేళ్ల చిన్నారికి జ్వరం రావడంతో.. వైద్యం కోసం మంగళవారం రోజున ఆసుపత్రి తరలించేందుకు సిద్దమయ్యారు.. లక్మాపూర్ వాగు ఉదృతిగా ప్రవహిస్తుండటంతో ఆందోళన గురయ్యారు. పాప ప్రాణాలు కాపాడాలంటే వాగు దాటక తప్పని పరిస్థితిలో సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఆ చిన్నారినీ తన భుజాలపై ఎత్తుకొని బాహుబలి సీన్ ను తలపించేలా వాగు దాటించడంతో ఆ చిన్నారిని కెరమెరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నెల రోజుల క్రితం ఇదే వాగు వద్ద కవిత, పవన్ దంపతుల ఏడాది బాబు విషయంలోను ఇదే సీన్ రిపీట్ అయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగు ఉధృతంగా ప్రవహచడంతో ఊరు జలదిగ్బందం అయింది. పవన్, కవితల కొడుకు కు తీవ్ర జ్వరం రావడంతో అత్యవసర పరిస్థితి లో కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు తండ్రి పవన్ సాహసం చేయక తప్పలేదు.
తమ బంధువు సహాయంతో ఏడాది వయసున్న కొడుకును చేతులతో పైకి ఎత్తుకొని బాహుబలి తరహాలో మోస్తూ వాగు దాటించి బిడ్డ ప్రాణాలు కాపాడుకున్నాడు ఆ తండ్రి. ఇలా ఒక్కటేమిటి వర్షకాలం వచ్చిదంటే ఇదే సాహసం.. ఇదే వ్యథ.
ఇటీవల నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలం తులసిపేట గ్రామంలో సేమ్ సీన్.. నిండు గర్భిణికి రాత్రి పది గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో… గ్రామస్తులు అతికష్టం మీద ఆమెను కడం వాగును దాటించారు. అయినా సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో నట్టడివిలో నాలుగు గంటల నరక యాతన అనుభవించి వాగు ఒడ్డునే నడిరోడ్డు పై మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ ఆదివాసీ తల్లి.
ఒక లక్మాపూర్ , ఒక తులసిపేట నే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ లోని 34 ఆదివాసీ గూడాలను వాగు కష్టాలు వెంటాడుతున్నాయి. లక్నాపూర్ వాగుపై వంతెన నిర్మాణానికి 2016లోనే రూ.3 కోట్లు నిధులు మంజూరైనా.. నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. అన్నార్పల్లి పంచయితీ పరిధిలోని గ్రామాలకు టీచర్లు రావాలన్నా.. ఈ వాగు దాటాల్సిందే. వాగు వచ్చిన రోజు టీచర్లు రాకుంటే చదువు అటకెక్కినట్లే. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదలు వచ్చినా.. ఇదే పరిస్థితి. వాగులపై వంతెనల నిర్మాణం పూర్తయితేనే తమ బాధలు తీరుతాయని చెపుతున్నారు. ఆదివాసీ గూడాల గిరిజనులు. కానీ మా గోడు వినే నాధుడే లేడని.. ఎన్ని సర్కార్లు మారినా చివరికి మన రాష్ట్రం మనకు సిద్దించినా.. మా జల్ జంగిల్ జమీన్ ఆశయాలు నెరవేరలేదని.. ఇప్పటికీ అదే గోస అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరీ ఈ బాహుబలి సీన్లకు ఎండ్ కార్డ్ పడేదెప్పుడో.. డోలీ కష్టాలు తొలగేదెప్పుడో.. వాగులపై వంతెనలు నిర్మాణం అయ్యేదెప్పుడో అని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..