AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్మాత్ జాగ్రత్త..! మాయమాటలే పెట్టుబడి.. ఏకంగా లక్షల్లో సంపాదన..!

తెలంగాణ మొత్తంలో ఇలాంటి యునాని సంస్థలు 400 పైగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్ధకు చెందిన మాటలు నమ్మరాదని తెలిపారు. ఇలాంటి సంస్థలకు సంబంధించి ఇంకా ఏదైనా సమాచారం గనక ఉన్నట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ సభ్యులు చెప్పారు.

తస్మాత్ జాగ్రత్త..! మాయమాటలే పెట్టుబడి.. ఏకంగా లక్షల్లో సంపాదన..!
Attullah Ayurvedic Private Limited Seized
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 22, 2025 | 9:57 PM

Share

కన్ను నొప్పి అని, కాలు నొప్పి అని.. సమస్య ఏదైనా చిటికెలో నయం చేస్తామని చెప్పే సంస్థలను ఎన్నో చూస్తూ ఉంటాం. అలాంటి సంస్థలు, దానికి చెందిన డాక్టర్లు ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఆశతో నోటికొచ్చింది చెప్పి, మోసాలు చేయడం కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. సామాన్య జనం సైతం అలాంటి వారి మాటలనే తేలికగా నమ్మేసి వాళ్ల బుట్టలో పడిపోయి, అడిగినంత ముట్టజెప్పి తీరా అంతా అయ్యాక మోసపోయామని బాధ పడుతుంటారు. అలాంటి వాళ్లు ఊళ్లల్లోని అమాయక జనాలను మాత్రమే మోసం చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఇంత చదువులు చదివి పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర ప్రజలను కూడా వాళ్లు విడిచిపెట్టడం లేదు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది.

నగర శివారు ప్రాంతంలోని జల్‌పల్లి గ్రామంలో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కొందరు.. అత్తుల్లాహ్ ఆయుర్వేదిక్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆకస్మిక దాడులు చేసి సీజ్ చేశారు. ఆ సంస్థకు సంబంధించిన డాక్టర్ పృథ్వీరాజ్(డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ ఆయుర్వేద), డాక్టర్ అరుంధిప్(డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ యునాని), సుకేష్ రత్నా(జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఆయుష్)లను గుర్తించారు. అతుల్లాహ్ సంస్థ ద్వారా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షలు సంపాదిస్తున్నారని తెలుసుకుని ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో దాడులు చేశారు. అమాయకమైన ప్రజలకు ఆశ చూపి పెద్దమొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారని, ఇలాంటి వాళ్లని ఊరికే వదిలితే మరింత మంది మోసపోయే అవకాశం ఉందని కఠినమైన చర్యలు తీసుకున్నారు.

ఈ మేరకు అత్తుల్లాహ్ సంస్థపై దాడులు జరిపి సీల్ చేశారు. ఈ అక్రమ దందాలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అండ్ డ్రగ్స్ మేజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 ప్రకారం.. ఈ సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో సైతం ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని, అందులో భాగస్వాములైన వారు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు వారి లైసెన్సులు రద్దు చేసేలా చూడాలని ఫిర్యాదు చేయడం జరిగింది.

అయితే.. దీనికి సంబంధించి ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు, ప్రజలు ఇలాంటి వారిని నమ్మవద్దని.. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేవారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణ మొత్తంలో ఇలాంటి యునాని సంస్థలు 400 పైగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్ధకు చెందిన మాటలు నమ్మరాదని తెలిపారు. ఇలాంటి సంస్థలకు సంబంధించి ఇంకా ఏదైనా సమాచారం గనక ఉన్నట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని చెప్పారు. సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ పక్కనే తమ ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీస్ ఉందని, అక్కడ సమాచారం ఇస్తే తక్షణమే రైడ్ చేసి ఇలా ప్రజలను మోసం చేసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..