ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెదవి విరిచారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం నష్టాల ఊబిలో నుంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న ఆర్టీసీపై పెను భారం మోపబోతోందన్నారు. ఇది దాదాపు ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న 50 వేల మంది కార్మికుల జీవితాలపై ప్రభావం చూపుతుందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం లేదని.. ఉచిత ప్రయాణ పథకం నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను పునరుద్ధరిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు.
అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం లక్షలాది మంది ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం చూపించే అవకాశముందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తమకు తగినంత ప్యాసింజర్లు దొరక్క రోడ్ల మీద పడతామేమోనని ఆటో డ్రైవర్లు భయపడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో తగిన ఉపాధి అవకాశాలు లేక పట్టణాల్లో రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పూట గడుపుతున్న ఆటో డ్రైవర్ సోదరులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వినతి..
ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపబోతున్నది. ఇది దాదాపుగా 50 వేల మంది ఆర్టీసి కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతున్నది. అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసి బస్సులు తెలంగాణ వచ్చినప్పటినుండి రకరకాల కారణాల…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 10, 2023
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటిగా హామీ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం పేరుతో ఈ గ్యారెంటీని సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శనివారం (డిసెంబరు 9) నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌక్యం కల్పిస్తున్నారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్లతో పాటు రాష్ట్రంలోని దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే వీరికి 50 శాతం రాయితీ ఉండగా.. వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి