ఓ ఆటోడ్రైవర్ సమయస్పూర్తి ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడి, ఆ కుటుంబాన్ని పెను విషాదంనుంచి బయటపడేసింది. డోర్నకల్ లింగాల అడ్డామీదుగా వెళ్తున్న ఓ ఆటోను ఆపి ఓ యువకుడు ఎక్కాడు. గోవింద్రాల స్టేజి వరకు వెళ్లాలని చెప్పాడు. ఆటో డ్రైవర్ ఆ వ్యక్తిని ఆటో ఎక్కించుకుని ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలో ఆటోలో కూర్చున్న యువకుడు తన సోదరికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందుకు తాను ఆల్రెడీ పురుగులు మందు తాగానని, ఆటోలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అది విన్న ఆటోడ్రైవర్ తనకెందుకులే అనుకోలేదు. సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన ఆటో డ్రైవర్ శివ ఆలస్యం చేయకుండా వాహనాన్ని డోర్నకల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అపస్మారస్థితికి చేరిన వ్యక్తి వద్ద ఉన్న ఫోన్ తీసుకుని ఆయన ఆటోలో మాట్లాడిన వ్యక్తి నెంబరుకు కాల్ చేశారు. ఇంతకు ముందు మీతో మాట్లాడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చానని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.
ఈలోగా బాధితుడికి పీహెచ్‌సీ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారంతో బంధువులను తీసుకుని ఆసుపత్రికి చేరుకున్న తల్లి సుశీల కొడుకుని చూసి కన్నీరు మున్నీరయ్యారు. స్పృహ తప్పిన ఆమెకు అక్కడే చికిత్స అందించారు. బాధిత వ్యక్తి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన పేరు భూక్య లాలు గా బాధితుడి బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటనేది తమకు తెలియదన్నారు. బాధితుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చామని 108 ఈఎంటీ శ్రీనివాస్, పైలట్ సైదులు తెలిపారు. పురుగుల మందు తాగిన వ్యక్తిని సమయస్ఫూర్తితో పీహెచ్‌సీకి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ శివను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..