Heavy rain warning : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఇరు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
రెండు రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన వాగుకు వరదనీరు పోటెత్తడంతో ఒక గేటు ఎత్తి వేశారు.
హైదరాబాద్‌లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అడుగుమేర గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు సింగరేణి ఏరియాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంచిర్యాలలో కేకే, ఆర్‌కేపీ, ఎస్‌ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
ఫలితంగా దాదాపు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అటు ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లోనూ 8 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నారుమడి టైమ్‌లో వర్షం పడడంతో వరిచేలు నీటమునుగుతున్నాయి. కాలువలు, డ్రైన్లు బాగుచేయకపోవడంతో ఇప్పటికే ముమ్మడివరం మండలంలో రైతులు ఇప్పటికే క్రాప్‌హాలిడే ప్రకటించారు.
Read also: Mallu Ravi : అన్ని జిల్లాల్లో దళిత బంధు స్కీం అమలు చేయాలి : మల్లు రవి