Telangana: మహిళలకు మరో శుభవార్త.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాంః సీఎం రేవంత్
తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది సభ్యులు చేరగా.. వారికి ఏడాదికి రెండు మంచి చీరలు చొప్పున ఇస్తామన్నారు.

తెలంగాణలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పక్‌పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు వారాల జల్లు కురిపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది సభ్యులు చేరగా.. వారికి ఏడాదికి రెండు మంచి చీరలు చొప్పున ఇస్తామన్నారు. దాని కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల 600 మంది మహిళలు బస్సుల యజమానులుగా మారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకు హైదరాబాద్ శిల్పారామంలో విలువైన స్థలంలో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న మహిళను ఒకలాగా.. గ్రామాల్లో ఉన్న మహిళలను వేరేలా చూడకుండా అందరికి ఒకే విధానం వర్తించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ ఆదేశించారు.
నారాయణపేట్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వా లని నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
