AP, Telangana News Live: హైదరాబాద్‌లో క్యూములోనింబస్ మేఘాలు.. మరో 2 గంటల్లో మళ్లీ జడివాన

AP, Telangana News Live: ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం సందర్భంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ IMD సూచన చేసింది..

AP, Telangana News Live: హైదరాబాద్‌లో క్యూములోనింబస్ మేఘాలు.. మరో 2 గంటల్లో మళ్లీ జడివాన
AP TS Live Updates

Edited By: Srilakshmi C

Updated on: Sep 18, 2025 | 9:59 PM

AP, Telangana News Live: హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లన్ని నీట మునిగాయి. యూసుఫ్‌ గూడ, కృష్ణానగర్‌,పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, టోలీచౌకీ, గచ్చిబౌలితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దంచి కొట్టింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్ని జలదిగ్బంధంలో ఉండిపోయాయి. దీంతో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలవడంతో ట్రాఫిక్‌కి తీ​వ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో వాహనదారులు అవస్ధలు పడుతున్నారు. అయితే రాత్రి కురిసిన వర్షానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం సందర్భంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ IMD సూచన చేసింది. మియాపూర్‌లో 9.7, లింగంపల్లిలో 8.2, HCUలో 8.5, గచ్చిబౌలిలో 6.6, చందానగర్‌లో 6.4, హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు:

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. అల్వాల్, మారేడుపల్లిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బూరుగు రమేష్‌ కుమారుడు విక్రాంత్‌ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు బృందాలుగా ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. బూరుగువిక్రాంత్ నాలుగు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. కాస్మో లీగల్ సర్వీసెస్, రాజశ్రీ ఫుడ్ సర్వీసెస్, బురుగు మహదేవ్ అండ్ సన్స్, టాక్ సవ్వీ కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు:

ఏసీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నేతలు ఆందోళనకు దిగారు.  ఈ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. యూరియా సమస్యపై చర్చించాలని మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే.. అసెంబ్లీ సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Sep 2025 09:58 PM (IST)

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3.38 కేజీల బంగారం పట్టివేత

    హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3.38 కేజీల బంగారాన్ని కస్టమ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐరన్‌ బాక్స్‌లో బంగారం దాచి తరలిస్తుండగా ముగ్గురు ప్రయాణికులు పట్టుబడ్డారు. ఈ బంగారం విలువ రూ.3.36 కోట్లు ఉంటుందని అంచనా.

  • 18 Sep 2025 09:56 PM (IST)

    ఓటీటీలోకి ‘మహావతార్‌ నరసింహ’ మువీ.. రిలీజ్‌ డేట్‌ ఇదే

    బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించిన ‘మహావతార్‌ నరసింహ’ మువీ ఓటీటీకి వచ్చేస్తుంది. ఈ మేరకు విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. తెలుగు సహా వివిధ భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది. సెప్టెంబర్‌ 19న మధ్యాహ్నం 12:30 గంటలకు ఓటీటీలో ఈ మువీని విడుదల చేయనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.


  • 18 Sep 2025 09:52 PM (IST)

    బిల్డింగ్‌ 3వ అంతస్తు నుంచి కింద పడ్డ వ్యాపారవేత్త.. వీడియో

    రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఓ వ్యాపార వేత్త ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. సెప్టెంబర్ 9న సాయంత్రం 5:50 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

  • 18 Sep 2025 09:50 PM (IST)

    శ్రీ‌శైలం మ‌ల్లన్న ఆల‌యానికి రూ.3.46కోట్ల ఆదాయం

    శ్రీ‌శైలం మ‌ల్లన్న ఆల‌యానికి భారీగా ఆదాయం స‌మ‌కూరింది. గురువారం హుండీల‌ను లెక్కించగా గ‌త 29 రోజుల్లో రూ.3,46,96,481 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

  • 18 Sep 2025 09:48 PM (IST)

    పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు హీరో సాయి దుర్గాతేజ్‌ విరాళం

    హైదరాబాద్‌ పోలీస్‌ విభాగానికి నటుడు సాయి దుర్గాతేజ్‌ రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌ 2025కు అతిథిగా హాజరైన నటుడు సాయి దుర్గాతేజ్‌ పోలీసు అధికారులకు చెక్కు అందజేశారు. 2021 సెప్టెంబరులో తాను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, 2 వారాల పాటు కోమాలో ఉన్నానని, తనకిప్పుడిది పునర్జన్మని అన్నారు. ప్రతి ఒక్కరూ బైక్‌ నడిపేటప్పుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

  • 18 Sep 2025 09:45 PM (IST)

    అత్యాచారం కేసులో లలిత్‌ మోదీ సోదరుడు అరెస్ట్

    అత్యాచారం కేసులో లలిత్‌ మోదీ సోదరుడు సమీర్‌ మోదీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

  • 18 Sep 2025 09:43 PM (IST)

    ఏపీ అసెంబ్లీ సెషన్లు 8 రోజులకు కుదింపు

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వానా కాలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశాల పనిదినాలను 8 రోజులకు కుదిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెప్టెంబర్‌ 27 వరకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

  • 18 Sep 2025 09:06 PM (IST)

    తాగుడు మానేయమని భర్త తిట్టినందుకు మినీ ట్యాంక్ బండ్‌లో దూకిన భార్య

    గోల్నాకకి చెందిన భవానికీ చంపాపేట్ చెందిన సాయికుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. భవాని తాగుడుకు బానిసై మద్యం సేవిస్తూ ఉండేది. ఈ విషయమై భర్త గొడవ పడుతూ ఉండేవాడు. గత మూడు నెలల క్రితం భార్యాభర్తలు గొడవపడి భవానీ పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పెద్దల సమక్షంలో మాట్లాడి చంపాపేటకు తన భర్త వద్దకు వచ్చిన భవాని మళ్లీ అదేపందా మొదలుపెట్టింది. రాత్రి మళ్ళీ మద్యం సేవించడంతో భర్త గొడవపడ్డాడు. భర్త తిట్టాడని సరూర్నగర్ లోని మినీ ట్యాంక్ బండ్లొ దూకిన భవాని. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్స్ సిబ్బంది ఆర్డిఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదు.

  • 18 Sep 2025 08:15 PM (IST)

    గుడ్‌న్యూస్‌.. ఇకపై AC బస్‌లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

    అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ లను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్రీ శక్తి పథకంతో ఆనందంగా ఉన్నారు. ఆర్టీసీ ఆస్తులను ఎవరికీ ధారాదత్తం చేయడం లేదు. ప్రత్యామ్నాయ డిపోలను ఏర్పాటు చేసే వరకు అటువంటి ఆలోచన లేదు. తిరుపతిలో ఉన్న ఆర్టీసీకి చెందిన 13 ఎకరాల స్థలంలో నేషనల్ హైవే లాజిస్టిక్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి అత్యాధునిక బిల్డింగ్ నిర్మించబోతున్నాం. రెండు సెల్లార్ లతో 10 అంతస్తులు ఉండేలా నిర్మిస్తున్నాం. ఆర్టీసీకి చెందిన ఆస్తులు, విలువైన స్థలాలు ఎవరికీ ధారాదత్తం చేయం.. ఆర్టీసీ డిపోలను లులు మాల్ కు ఇవ్వడం లేదు. ఇంకో ప్రత్యామ్నాయ డిపో వచ్చేవరకు గవర్నర్ పేట డిపో స్థలం ఎవ్వరికీ ఇవ్వం. త్వరలో మరో 1500 ఎలెక్ట్రిక్ బస్‌లు తీసుకొస్తున్నాం. వీటిని పల్లె వెలుగు బస్సులుగా వినియోగిస్తాం. ఇకపై మహిళలు ఏసీ బస్‌లలోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

  • 18 Sep 2025 07:09 PM (IST)

    హైదరాబాద్‌లో తిష్టవేసిన క్యూములోనింబస్ మేఘాలు.. మరో 2 గంటల్లో మళ్లీవాన

    రాగల రెండు, మూడు గంటలలో తెలంగాణలోని సౌత్ జిల్లాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యపేట జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు రాత్రి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు పగటిపూట వేడి వాతావరణం సాయంత్రం అయ్యేసరికి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తున్నాయి.

  • 18 Sep 2025 07:07 PM (IST)

    అంబర్ పేటలో బతుకమ్మ కుంట కబ్జా.. CMకి మాజీ ఎంపీ వీహెచ్ హన్మంతరావు కృతజ్ఞతలు

    మొన్నటివరకు అంబర్ పేటలో బతుకమ్మ కుంట కబ్జా చేయడం జరిగింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాగానే వెంటనే హైడ్రాతో ఆ కుంటను పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. అందరు మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలి‌. బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరపాలని గాంధీ భవన్‌లో మాజీ ఎంపీ వీహెచ్ హన్మంతరావు అన్నారు.

  • 18 Sep 2025 06:48 PM (IST)

    శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు ఛైర్మన్ల నియామకం

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు దేవాలయాలకు ఛైర్మన్లను నియమించింది ఏపీ సర్కార్. శ్రీశైలం మల్లన్న ఆలయ ఛైర్మన్‌గా రమేష్‌ నాయుడు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా వెంకట్రాజు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఛైర్మన్‌గా సురేంద్రబాబు, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్‌, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా రాధాకృష్ణ.. నియమించారు.

  • 18 Sep 2025 06:20 PM (IST)

    హైదరాబాద్‌లో కుంభవృష్టి.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

    హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ ,విద్యుత్ వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కుంభవృష్టి పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అత్వసరమైతేనే ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడ ఇబ్బందులు ఉన్న వెంటనే స్పందించాలని తెలిపారు. మ్యాన్ హోల్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

  • 18 Sep 2025 06:09 PM (IST)

    మాంసాహార రెస్టారెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు

    రాజస్థాన్‌లోని కోటా నగరంలోని భీమ్‌గంజ్ మండి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దుండగులు మాంసాహార రెస్టారెంట్ యజమానిపై బుధవారం రాత్రి కాల్పులు జరిపారు. రెస్టారెంట్ యజమాని అతిక్ కాల్పుల నుండి తృటిలో తప్పించుకున్నాడు. అరడజను మంది దుండగులు ఆయుధాలతో రెస్టారెంట్‌లోకి ప్రవేశించారు. దుండగుల్లో ఒకరు యజమానిపై తుపాకీ గురిపెట్టారు. కొంతమంది దుండగులు ఇనుప రాడ్‌లు, పైపులతో దాడి చేశారు. దుండగులందరూ రెస్టారెంట్‌పై మెరుపుదాడి చేశారు. అయితే, దుకాణ యజమా, అతని సహచరులు ధైర్యంగా దుండగులను ఎదుర్కొని తప్పించుకోగలిగారు. పారిపోతుండగా, దుండగులు కాల్పులు జరిపి, తృటిలో తప్పించుకున్నారు. మొత్తం సంఘటన సిసిటివిలో రికార్డైంది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, భీమ్‌గంజ్ మండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం అర్థరాత్రి రెస్టారెంట్ యజమాని అతిక్ పై దాడి చేయడానికి దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అనుమానితుల కోసం గాలిస్తున్నారు.

  • 18 Sep 2025 06:02 PM (IST)

    తిరుపతి ప్రతిష్ట దెబ్బతీసేలా నిందలు వేస్తే సహించేది లేదు..TTD సభ్యుడు భాను ప్రకాష్

    టార్గెట్ తిరుమలగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ హెచ్చరించారు. కొందరు తిరుమల క్షేత్రంపై నిందలు వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామితో వెటకారం చేస్తూ అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. టిటిడి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గత కొన్ని నెలలుగా మాట్లాడు
    తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల ముందు అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం ఉంది. తిరుపతి ప్రశాంతతను భగ్నం కలిగించేలా సీక్రెట్ అజెండా ఉన్నట్లు ఉంది. గోశాల నుంచి గోవిందుడు వరకు అసత్య ప్రచారాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి తీరును భక్తులు గమనిస్తున్నారని భాను ప్రకాష్ పేర్కొన్నారు.

  • 18 Sep 2025 05:57 PM (IST)

    కుండపోత వర్షం.. రోడ్లపై భారీగా నిలిచిపోయిన వరద నీరు

    హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. రోడ్లమీదకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికార యంత్రాంగం.. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, శేర్లింగంపల్లి, బాలానగర్, మూసాపేట్, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ మళ్ళిస్తున్న పోలీసులు. శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారి చెరువుని తలపిస్తోంది. అపార్ట్మెంట్లోకి చేరుతున్న వరద నీరు.

  • 18 Sep 2025 05:54 PM (IST)

    ఎయిర్‌ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

    ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన విమానం కొంతదూరం వెళ్లాక దాని రెక్కల్లో పక్షి ఇరుక్కుంది. దీంతో పక్షి విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది.

  • 18 Sep 2025 05:08 PM (IST)

    వరుస ఎన్‌కౌంటర్లు.. లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మా, బీజాపూర్ జిల్లాకు చెందిన దళ సభ్యులు. లొంగిపోయిన వారికి రూ.25 వేలు సాయం అందించిన ఎస్పీ. ఆపరేషన్ చేయూతలో భాగంగా ఈ ఎనిమిది నెలల్లో 320 మంది మావోయిస్టులు లొంగుబాటు.

  • 18 Sep 2025 05:06 PM (IST)

    ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

    ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి. చనిపోయిన మావోయిస్టులపై గతంలో రూ. 5 లక్షల రివార్డు ప్రకటన.

  • 18 Sep 2025 05:04 PM (IST)

    దసరా పండక్కి 7,754 టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

    బ‌తుక‌మ్మ, దసరాకు ప్రయాణికుల సౌకర్యార్ధం టీజీఎస్ఆర్టీసీ 7,754 స్పెషల్ బస్సులు నడుపుతుంది. సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు నడపనుంది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. సెప్టెంబర్‌ 30న‌ సద్దుల బ‌తుకమ్మ, అక్టోబ‌ర్ 2న దసరాకు భారీగా సొంతూళ్లకు ప్రయాణాలు.. ఇక అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ తిరుగు ప్రయాణంలో రద్దీ నెలకొనే అవకాశం ఉంది.

  • 18 Sep 2025 05:01 PM (IST)

    చర్లపల్లి మహిళ హత్య కేసులో వెలుగులోకి దారుణాలు

    చర్లపల్లి మహిళ హత్య కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు 38 కిలోమీటర్లు మృతదేహంతో ట్రావెల్ చేసినట్టు గుర్తింపు.నార్సింగ్‌లో ఆటో బుక్ చేసుకున్న నిందితుడు.. నార్సింగ్ నుంచి చర్లపల్లికి మృతదేహంతో ప్రయాణం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

  • 18 Sep 2025 04:59 PM (IST)

    పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం.. భారీగా పట్టివేత

    అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ చౌక దుకాణంలోని బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలిస్తున్న ముఠా గుట్టురట్టు. రాజంపేట-పుల్లంపేట అటవీ ప్రాంతంలోని సరిహద్దులో భారీ గోడౌన్ నుంచి రేషన్‌ బియ్యాన్ని వివిధ బ్రాండ్ల పేర్లతో బహిరంగ మార్కెట్ కు తరలిస్తున్న కేటుగాళ్లు. గోడౌన్ నిండా వందలాది బియ్యం బస్తాలు. రాజంపేట నుంచి బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడుకు తరలిస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణ. కర్ణాటకకు చెందిన ఓ లారీ బియ్యం అక్రమ రవాణా చేస్తూ బురదలో ఇరుక్కోవడంతో వెలుగులోకి వచ్చిన స్కాం. అటవీ ప్రాంతంలోని గోడౌన్‌కు చేరుకుని తాళాలు పగలగొట్టి బియ్యం బస్తాలు లెక్కిస్తున్న రెవెన్యూ అధికారులు.

  • 18 Sep 2025 04:24 PM (IST)

    జంట నగరాల్లో మళ్లీ దంచికొడుతున్న జడివాన..

    హైదరాబాద్‌ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వానకే నగరం అతలా కుతలమైంది. గంట వ్యవధిలోనే 10 సెం. మీలకు పైగా వర్షపాతం నమోదైంది. మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

  • 18 Sep 2025 03:44 PM (IST)

    నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

    రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు.

  • 18 Sep 2025 03:41 PM (IST)

    వ్యాపారి ఇంట్లో భారీ చోరీ.. 47 తులాల‌ బంగారం మాయం

    మైలార్ దేవ్‌పల్లి లో దుండగులు రెచ్చిపోయారు. శాస్త్రీపూరం కింగ్స్ కాలనీలో వ్యాపారి ఇల్లు గుళ్ల చేసిన గుర్తు తెలియని దుండగులు. ఇంటి తాలాలు పగలగొట్టి బిరువాలోని 47 తులాల‌ బంగారం 11 వేల నగదుతో పాటు ఖరీదైన్ విదేశీ వాచీలు చోరి. ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు స్వేకరించాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

  • 18 Sep 2025 03:36 PM (IST)

    తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. జగిత్యాలలో దొంగల ముఠా వరుస చోరీలు

    జగిత్యాల జిల్లాలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఓ దొంగల ముఠా వరుస చోరీలకు పాల్పడుతుంది. గణేశ్ నగర్, హరిహరనగర్‌లో ఒకే రోజు ఏకంగా 6 ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

  • 18 Sep 2025 03:35 PM (IST)

    చెన్నూర్ SBI బ్యాంక్ చోరి చేసింది ఇంటి దొంగలే.. 44 మంది అరెస్టు

    మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్‌బీఐ బ్యాంక్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌. అసలు నిందితులు బ్యాంకు అధికారులేనని తేల్చిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 44 మందిని అరెస్టు చేసిన పోలీసులు. రూ.12.60 కోట్ల విలువచేసే బంగారం, రూ. 1.10 కోట్ల నగదు అపహరణ. బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగే రవీందర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుకాగా బ్యాంకు మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, తాత్కాలిక ఉద్యోగి లక్కాకుల సందీప్ లతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

  • 18 Sep 2025 03:30 PM (IST)

    మాజీ CM జయలలిత స్నేహితురాలు శశికళ సంస్థలపై ఈడీ దాడులు

    తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు చెందిన సంస్థల్లో ఈడీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. చెన్నై, హైదరాబాద్‌లోని 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరిపారు. జీఆర్‌కే రెడ్డికి చెందిన మార్గ్‌ గ్రూప్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. జీఆర్‌కే రెడ్డిని శశికళ బినామీగా భావిస్తున్న అధికారులు. బ్యాంకులను రూ.200 కోట్లకు మోసం చేసిన సీబీఐ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది.

  • 18 Sep 2025 03:26 PM (IST)

    మిర్యాలగూడ MLA గొప్ప మనసు.. CM రేవంత్‌కి రూ. కోట్ల విరాళం అందజేత

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మిర్యాలగూడ MLA బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు. రూ.2 కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరిన MLA బత్తుల లక్ష్మారెడ్డి. ఇటీవల ఆయన కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి.. కానీ రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

  • 18 Sep 2025 03:22 PM (IST)

    అఫ్జల్ సాగర్ మురికికాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.. మరొకరి కోసం గాలింపు

    హైదరాబాద్‌ అఫ్జల్ సాగర్ మురికికాలువలో నాలుగు రోజుల క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. నల్గొండ జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వీకరించేందుకు నల్గొండ బయలుదేరారు. గల్లంతైన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • 18 Sep 2025 03:21 PM (IST)

    శబరిమల దేవుడి విగ్రహాల బంగారం చోరీ

    కేరళలోని శబరిమల విగ్రహాల బంగారం చోరీకి గురయ్యింది. ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూతతో ఉన్న రాగి పలకలను మరమ్మతులకు తరలించిన దేవస్థానం బోర్డు. అందులో కొంత బంగారం తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగారం మాయంపై దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది.

  • 18 Sep 2025 03:19 PM (IST)

    సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ED సోదాలు.. మరో వ్యాపారవేత్త ఇంటిపై దాడి

    సికింద్రాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త v బూర్గు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి మారేడుపల్లిలోని ఈ ఇద్దరి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

  • 18 Sep 2025 03:15 PM (IST)

    యాక్సిలరేటర్‌ నొక్కడంతో అదుపుతప్పిన వ్యాన్‌.. డ్రైవర్‌ మృతి

    ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం. ఢిల్లీలోని మందిర్ మార్గ్ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ PCR వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఢిల్లీ పోలీస్ PCR వ్యాన్ డ్రైవర్ ప్రమాదవశాత్తు యాక్సిలరేటర్‌ను నొక్కడంతో రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలంలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని గంగారాం తివారీ (55)గా గుర్తించారు. అతను అక్కడ టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలిసింది. తెల్లవారుఝామున 5.05 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీపంలో పోలీస్ ఔట్ పోస్ట్ లో పోలీసు సిబ్బంది మద్యం సేవించారని, ఆ తర్వాత వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనంలో ఉన్న ఇద్దరు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

  • 18 Sep 2025 02:00 PM (IST)

    ఏపీ శాసన మండలి నుంచి YCP వాకౌట్‌

    ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్‌ అయ్యింది. తిరుపతి, సింహాచలం తొక్కిసలాట ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. తొక్కిసలాట ఘటనలను జగన్ రాజకీయం చేశారన్న మంత్రి ఆనం వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్సీలు తప్పబట్టారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తోందని వైసీపీ వాకౌట్‌ అయ్యింది.

  • 18 Sep 2025 01:48 PM (IST)

    పేదలకు ఇళ్లిస్తే BRSకు కడుపుమంట: పొంగులేటి

    తెలంగాణ రాష్ట్రంలో పేదలకు గృహాలను ఇస్తే బీఆర్‌ఎస్‌కు కడుపు మంట అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ అన్నారు. కమీషన్‌ రాదనే గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని, గులాబీ నేతలు విషం చిమ్ముతున్నారన్న పొంగులేటి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధిని ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

  • 18 Sep 2025 01:12 PM (IST)

    కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాకిచ్చారు పోలీసులు

    Andhra Pradesh: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాకిచ్చారు పోలీసులు. తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్లి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. తాడిపత్రి సమీపంలోని కొండాపురం దగ్గర కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దాంతో, తాడిపత్రిలో మరోసారి టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఐదు కంటే ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతరం చెప్పారు పోలీసులు. తాడిపత్రి సీఐ అనుమతి తీసుకోకుండానే గ్రామాల్లో పర్యటించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లాలన్నా SHO అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు పోలీసులు.

    దాంతో, పోలీసులు, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. హైకోర్డ్‌ ఆర్డర్స్‌ను ఉల్లంఘించారంటూ తాడిపత్రి వెళ్లకుండా పెద్దారెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొండాపురం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి పంపించారు పోలీసులు. హైకోర్డ్‌ ఆర్డర్స్‌ ప్రకారం పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుకు అవుతోన్న ఖర్చులను పెద్దారెడ్డి నుంచి వసూలు చేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పెద్దారెడ్డి నుంచి ఖర్చులు వసూలు చేయకుండా ఎలా తిరగనిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు జేసీ. పెద్దారెడ్డి నుంచి ఖర్చులు వసూలు చేయకపోతే.. పెద్దారెడ్డిని తానే అడ్డుకుంటానంటూ హెచ్చరించిన ప్రభాకర్‌రెడ్డి.

  • 18 Sep 2025 12:46 PM (IST)

    కవిత రాజీనామాపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

    ఎమ్మెల్సీ కవిత రాజీనామా అంశంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామా ఆమోదించాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని.. ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నారు.. పునరాలోచన చేసుకోవాలని చెప్పానన్నారు.

  • 18 Sep 2025 12:20 PM (IST)

    సీఈసీపై రాహుల్‌ తీవ్ర ఆరోపణలు

    సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ టార్గెట్‌గా రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు వెనుక అజ్ఞాత శక్తులు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని సీఈసీ కాపాడుతోందన్నారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట మమ్మల్ని టార్గెట్ చేసి ఓట్లు తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.

  • 18 Sep 2025 12:05 PM (IST)

    లోక్ సభలో రాహుల్ సంచనల వ్యాఖ్యలు

    Delhi: సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం ఓట్లు డిలీట్‌ చేస్తున్నారు.. ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో నేను మాట్లాడుతున్నా.. అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్‌ చోరీపై హైడ్రోజన్ బాంబ్‌ పేరుతో రాహుల్‌గాంధీ గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేల ఓట్లు తొలగించారని.. ఫేక్‌ లాగిన్స్‌, డిజిటల్ ఫామ్స్‌తో ఓట్లు తొలగిస్తున్నారన్నారు.

  • 18 Sep 2025 11:55 AM (IST)

    ఏసీ శాసన సభలో గందరగోళం

    AP: రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు పారిపోతుందంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే ప్రశ్నిస్తున్నాం.. ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు బొత్స. గత ఐదేళ్లలో ఇలాంటి సమస్యలు ఎందుకు లేవంటూ బొత్స ప్రశ్నించారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం రెడీ ఉందన్న మంత్రి అచ్చెన్నాయుడు.. ఎక్కడికీ పారిపోవడం లేదన్నారు.
    సభ ద్వారా అన్నీ ప్రజలకు చెప్తామన్నారు అచ్చెన్నాయుడు

  • 18 Sep 2025 11:40 AM (IST)

    రైతు సమస్యలపై శాసన మండలిలో మాటలయుద్ధం

    రైతు సమస్యలపై శాసన మండలిలో మాటల యుద్ధం నెలకొంది. యూరియాపై కౌన్సిల్‌లో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

  • 18 Sep 2025 11:28 AM (IST)

    వైద్యం అందక బాలిక మృతి

    AP: పాము కాటుకు గురైన ఓ బాలిక సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది.. ఆసుపత్రికి అంబులెన్స్ లో వెళ్తూ ఊపిరి ఆగింది.. సకాలంలో అంబులెన్స్ రాకపోవడం.. వచ్చిన ఫీడర్ అంబులెన్స్ కూడా మార్గమధ్యలోనే బాలికను తీసుకెళ్తూ మరమ్మతులకు గురైంది. దీంతో వైద్యం మరింత ఆలస్యమై ప్రాణాల కోల్పోయింది ఆ బాలిక.. కళ్ళముందే బాలిక ఊపిరి పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.. ఈ విషాద ఘటన అల్లూరి జిల్లా జికే విధి ఏజెన్సీలో ఈ ఘటన జరిగింది.

  • 18 Sep 2025 11:10 AM (IST)

    రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధమే: అచ్చెన్నాయుడు

    రైతు సమస్యలపై చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్‌ తిరస్కరించారు. వైసీపీ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందన్న టీడీపీ సభ్యులు ఆరోపించారు. యూరియా కొరతపై మాట్లాడాలంటూ చైర్మన్ పొడియాన్ని వైసీపీ చుట్టుముట్టింది. గందరగోళం మధ్య సభను వాయిదా వేశారు చైర్మన్.

  • 18 Sep 2025 10:56 AM (IST)

    ఏపీ శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

    ఏపీ శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది. యూరియా సమస్యపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం చేసింది. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబట్టారు. రైతు సమస్యలపై చర్చ కోసం BAC లో సమయం కోరాలని చైర్మన్ కోరారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది.

  • 18 Sep 2025 10:45 AM (IST)

    మోదీకి శుభాకాంకలు తెలిపిన వాటికన్ నగర అధిపతి పోప్ లియో XIV

    సెప్టెంబర్ 17తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 ఏళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి బ్రిటిష్ ప్రధాన మంత్రి జార్జియా మలోనీ వరకు, వాటికన్ నగర అధిపతి పోప్ లియో XIV కూడా తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీకి ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు .

  • 18 Sep 2025 10:15 AM (IST)

    హైదరాబాద్‌లో ఈడీ అధికారుల సోదాలు

    హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. అల్వాల్, మారేడుపల్లిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బూరుగు రమేష్‌ కుమారుడు విక్రాంత్‌ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు బృందాలుగా ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. బూరుగువిక్రాంత్ నాలుగు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. కాస్మో లీగల్ సర్వీసెస్, రాజశ్రీ ఫుడ్ సర్వీసెస్, బురుగు మహదేవ్ అండ్ సన్స్, టాక్ సవ్వీ కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు.

  • 18 Sep 2025 09:47 AM (IST)

    రెచ్చిపోయిన దొంగలు

    మైలార్‌దేవ్‌పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. 47 తులాల గోల్డ్, నగదు, విదేశీ వాచ్‌లు చోరీ చేశారు దొంగలు. రంగంలోకి పోలీసులు క్లూస్‌ టీమ్‌తో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

  • 18 Sep 2025 09:15 AM (IST)

    ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

  • 18 Sep 2025 08:49 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాల లైవ్

    కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రసవత్తరంగా కొనసాగనున్నాయి.

     

    ఏపీ అసెంబ్లీ సమావేశాల లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 18 Sep 2025 08:47 AM (IST)

    ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌

    AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌ ముగిసింది. ACB కోర్టులో నిందితులను హాజరు పర్చనుంది సిట్‌. లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై ACB కోర్టులో విచారణ సాగుతుంది. రాజ్‌ కేసిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు స్టే విధించడంతో ACB కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మిథున్ రెడ్డిని కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నేడు సిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ACB కోర్టు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డి ఉన్నారు. 5 రోజుల పాటు మిథున్ రెడ్డిని విచారించేందుకు కస్టడీకి కోరింది సిట్‌. మిథున్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పపై ఇప్పటికే నోటిస్‌ ఇచ్చిన ఎసిబి కోర్టు.

  • 18 Sep 2025 08:40 AM (IST)

    ఆర్జిత సేవా టికెట్లు:

    తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

  • 18 Sep 2025 08:30 AM (IST)

    TTD టికెట్స్

    తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్‌లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనాలు, గదుల కోటాను నేడు(గురువారం18) ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది..ఇవాళ టికెట్లు బుక్ చేసుకున్న వారికి డిసెంబర్ నెలలో రోజూ వారి దర్శనం చేసుకునేందుకు వీలు ఉంటుంది.

  • 18 Sep 2025 08:23 AM (IST)

    మరోసాకి ప్రకృతి విలయం

    దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. ఆకాశానికి చిల్లుపడ్డట్టు కురిన కుంభవృష్టితో మోక్ష నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. పలు ప్రాంతాలు నీటమునిగి.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లాలోని నందనగర్‌లో క్లౌడ్ బరస్ట్ విరుచుకుపడింది. ఆకస్మిక వరదల కారణంగా వార్డ్ కుంటారి లగాఫాలిలో ఆరు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారని, ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.

  • 18 Sep 2025 08:12 AM (IST)

    వరదలో కొట్టుకుపోయి ఒకరి మృతి

    Hyderabad: హైదరాబాద్‌లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. ఎస్‌ఆర్‌నగర్‌లో నిన్న రాత్రి గాలివానకు ఓ భారీ వృక్షం విరిగిపడింది. ఓ కాలేజీ భవనంపై చెట్టు విరిగి పడింది. దీంతో విరిగిపడిన చెట్లను DRF, విద్యుత్‌ సిబ్బంది తొలగిస్తున్నారు. అలాగే ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతంలో వరద నీటిలో ఒకరు కొట్టుకుపోయి మృతి చెందాడు.

  • 18 Sep 2025 07:48 AM (IST)

    భారీ అగ్ని ప్రమాదం

    తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని EMCలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఏడు ఫైర్ ఇంజన్‌లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తోంది అగ్నిమాపక సిబ్బంది. పరిశ్రమలో నైట్ షిఫ్ట్ సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

  • 18 Sep 2025 07:15 AM (IST)

    ఆరు ఆర్డినెన్స్‌ బిల్లులు

    ఏపీ అసెంబ్లీలో ఇటీవల తీసుకొచ్చిన ఆరు ఆర్టినెన్స్ లను బిల్లులు చేయనుంది ప్రభుత్వం. వీటితో కలిపి 20 బిల్లులను ఈ సమావేశాల్లో తెచ్చే ప్రణాళిక ఉంది.15 నెలల కూటమి విజయాలను అసెంబ్లీ వేదికగా మరోసారి వివరించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.

  • 18 Sep 2025 07:03 AM (IST)

    నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

    నేటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో సభ ప్రారంభం కానుంది. అలాగే 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి ప్రారంభం కానుంది.

    దసరా పండుగ నేపద్యంలో ఐదు పని దినాల పాటు అసెంబ్లీను నిర్వహించే ఆలోచన ఉంది. ప్రశ్నోత్తరాల తర్వాత BAC సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • 18 Sep 2025 06:57 AM (IST)

    వర్షాలపై సీఎం రేవంత్‌ సమీక్ష

    హైదరాబాద్‌లో నిన్న రాత్రి భారీ వర్షాలు కురియడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో కురిసిన వర్షాల కారణంగా ఏయే ప్రాంతాల్లో ప్రభావం ఉండనుందో తెలుసుకుని అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.

  • 18 Sep 2025 06:54 AM (IST)

    బంగాళాఖాతంలో అల్పపీడనం

    — నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

    — తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ద్రోణి

    — రాయలసీమలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

    — కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరులలో భారీ వర్షాలు

    — బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు..

    — తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

    — తెలంగాణలోనూ మరో రెండ్రోజుల పాటు వర్షాలు

    — పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

    — గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు

    — ఇవాళ ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

  • 18 Sep 2025 06:40 AM (IST)

    హైదరాబాద్‌లో ముంచెత్తిన వర్షం

    హైదరాబాద్‌లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. నగరాన్ని ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి.