Khammam: ఉపాధి హామి కూలీలు మట్టి తవ్వుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యం
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఉపాధి హామి పథకం కింద పేద ప్రజలకు ప్రభుత్వం పనులు కల్పిస్తోంది. దీంతో స్థానికంగా ఉన్న పొలాల్లో, కందకాలు, చెరువుల్లో తవ్వకాలు జరుపుతుండగా.. పురాతన విగ్రహాలు, చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలరాతి బుద్ధ విగ్రహం బయటపడింది.

ఖమ్మం జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చింతకాని మండలం నాగులవంచలో పురాతన బుద్ధుడి విగ్రహం బయటపడింది. అది పాలరాతి విగ్రహంగా చెబుతున్నారు. స్థానిక రైతు కోలేటి నాగేశ్వరరావు.. వ్యవసాయ క్షేత్రానికి సమీపంగా శనివారం రోజున ఉపాధి హామి పథకం కింద పనిచేస్తున్న కూలీలు మట్టి తవ్వుతుండగా.. ఈ విగ్రహం బయల్పడింది. అక్కడే మరో 2 శిలలను కూడా గుర్తించారు. ఆ ప్రాంతంలోనే గతంలో మట్టి కుండలు, పాత్రలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
విషయం తెలియడంతో రెవిన్యూ అధికారులు, పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. విగ్రహాన్ని రైతు పోలీసులకు అప్పగించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు విగ్రహం బయటపడిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఆ పురాతన పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం క్రీ.పూ. ఒకటి- క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య కాలం నాటిదని అంచనా వేశారు. ఈ ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.

Buddha Statue
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
