ఆకాశంలో సగం, అవకాశంలో సగం, అన్నింటా సగమని గౌరవించుకునే మహిళా లోకానికి ఇటీవలె పెద్దపీట వేసింది పార్లమెంట్. ఐదు దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తోన్న మహిళా బిల్లుకు మోక్షం లభించింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో నారీ లోకం కోసమే ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. అదీ కూడా తెలంగాణలోనే..
కొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహిళల కోసమే ఓ రాజకీయ పార్టీ అవర్భివించింది. మహిళకు ఏ పార్టీ న్యాయం చేయడం లేదని.. సరైన ప్రాతినిధ్యం లేదని అందుకే మహిళల కోసమే పార్టీ స్థాపించినట్టు అ పార్టీ అధ్యక్షుడు అనంత విష్ణు ప్రభు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ పార్టీ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. పార్టీ మేనిఫెస్టోలో మహిళల సంక్షేమం కోసం పలు రకాలైన హామీలు ఇచ్చారు.
తెలంగాణ లో మహిళా రాజ్యం రాబోతుందని జై మహా భారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భగవాన్ అనంత విష్ణు ప్రభు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జై మహా భారత్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా యుద్ధ భేరి సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించనునట్లు విష్ణు ప్రభు ప్రకటించారు. దేశంలో ఆడవాళ్లకు మేలు చేసే ఏకైక పార్టీ జై మహా భారత్ పార్టీ అని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యా, వైద్యం, అందిస్తామని, సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని తెలిపారు. భూలక్ష్మి పథకం కింద ప్రతీ ఒక్క మహిళకు 200 గజాల స్థలం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మహిళలు తల ఎత్తుకునేలా చేస్తామని, జై మహా భారత్ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తుందని అనంత విష్ణు ప్రభు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి