MLC Kavitha: ‘నేను కేసీఆర్ బిడ్డను తప్పు చెయ్యను’.. తీహార్ జైలు నుంచి కవిత విడుదల..

|

Aug 27, 2024 | 10:04 PM

రిలీజ్ ఆర్డర్స్‌ అందినప్పటికీ.. తీహార్ జైలు నుంచి కవితను విడుదల చేయడానికి కొన్ని గంటల ప్రాసెస్ కొనసాగింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్, హారీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలు వద్దకు చేరుకున్నారు.

MLC Kavitha: ‘నేను కేసీఆర్ బిడ్డను తప్పు చెయ్యను’.. తీహార్ జైలు నుంచి కవిత విడుదల..
Mlc Kavitha
Follow us on

సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవిత తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ట్రయల్ కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ అనంతరం కవిత జైలు నుంచి బయటకు వచ్చారు.. కవిత భర్త అనిల్‌ కుమార్, ఎంపీ వద్దిరాజు పది లక్షల రూపాయల ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. అయితే.. రిలీజ్ ఆర్డర్స్‌ అందినప్పటికీ.. తీహార్ జైలు నుంచి కవితను విడుదల చేయడానికి కొన్ని గంటల ప్రాసెస్ కొనసాగింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్, హారీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలు వద్దకు చేరుకున్నారు. కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి ఆమెకు స్వాగతం పలికారు.. బయటకు వచ్చిన తర్వాత కొడుకును హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు.. కుమారుడితోపాటు భర్త, సోదరుడు కేటీఆర్‌కు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఓపెన్ టాప్‌ కారులో కవిత కార్యకర్తలకు అభివాదం చేశారు. తన కోసం వచ్చిన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తాను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు.. 18ఏళ్ల రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. తనను ఇబ్బందిపెట్టినందుకు మూల్యం చెల్లించుకుంటారంటూ కవిత పేర్కొన్నారు.

కాగా.. ఈ రాత్రికి కవిత, కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం..

వీడియో చూడండి..

ఇవాళ ఏం జరిగిందంటే..

కాగా.. మంగళవారం కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. బెయిల్‌ ఇవ్వకూడదని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు.. బెయిల్‌కు అర్హత ఉందంటూ ఎమ్మెల్సీ కవిత తరపు లాయర్లు వాదించారు. కవితకు బెయిల్‌ రావడానికి కారణం.. ఆమె తరపున ముకుల్ రోహత్గీ వినిపించిన వాదనలే. ఢిల్లీ లిక్కర్‌ కేసులో విచారణ పూర్తవడమే కాదు.. ఈడీ, సీబీఐ ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేశాయన్నారు రోహత్గీ. అందుకే, సహ నిందితుడుగా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ షరతులే కవితకు కూడా వర్తిస్తాయని వాదించారు. అయితే ఈడీ మాత్రం కవితకు బెయిల్‌ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదించింది. కవిత ఫోన్‌లలో డేటా ఉద్దేశపూర్వకంగా డిలీట్‌ చేశారని కోర్టుకు తెలిపింది. ఫోన్‌లో డేటా డిలీట్‌ చేయడం సహజమే కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో.. డిలీట్‌ చేయడం వేరు, ఫోన్‌ను కావాలని ఫార్మాట్‌ చేయడం వేరు అని చెప్పుకొచ్చారు ఈడీ తరపు న్యాయవాది ఎస్వీ రాజు. పైగా విచారణకు కవిత అస్సలు సహకరించడం లేదన్నారు. సాక్షులను కవిత బెదిరించారని కూడా వాదించారు. అయితే.. ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించినట్లు ఈడీ ఆరోపిస్తున్నప్పటికీ.. ఎక్కడా కేసు నమోదు కాలేదని ముకుల్ రోహత్గీ వాదించారు.

రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ గవాయ్.. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. కవితకు బెయిల్‌ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధాన కారణాలు చెప్పింది. ఈ కేసులో సీబీఐ ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం ఒక కారణం.. ఈడీ తన దర్యాప్తును పూర్తిచేయడం రెండో కారణం కాగా.. ఒక మహిళగా 166 రోజుల పాటు జైల్లో ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం మూడో కారణం. సో, నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. ఈడీ, సీబీఐ కేసులలో కవితకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. తమ వాదనలో న్యాయం ఉంది కాబట్టే.. కవితకు బెయిల్‌ వచ్చిందన్నారు న్యాయవాది మోహిత్‌ రావు. ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా జైల్లో పెట్టారనడానికి.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..