బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..
కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్లు. మొన్న హైదరాబాద్‌లో.. నిన్న ఖమ్మంలో సేమ్ సీన్ కనిపించింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో జేబులు నింపుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడిక్కడ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ వ్యాపారుల్లో చలనం కనిపించడం లేదు. ఇవన్నీ మాములే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బయట కలర్ ఫుల్ ప్యాకింగ్.. లోపల కల్తీ కోటింగ్‌తో జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఖమ్మంలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు.
ఖమ్మంలోని రిక్కా బజార్‌లో ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు. కల్తీ మ్యాజిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నాణ్యత లేక, దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ తనిఖీల్లో సుమారు 960 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇన్స్టంట్ ఫుడ్‌పై ప్రజలు విపరీతంగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో వారు వాడుతుంది మంచిదా.? లేదా.? అన్న విషయం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలావరకు బయట కొంటారు.
ఇలాంటి చిన్న విషయాలనే ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు నకిలీగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. గతకొన్ని రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలోని గబ్బుకొట్టే వంట గదులను చూశాం. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ కల్తీ కోటింగ్‌ని చూస్తున్నాం. అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న షాకింగ్ విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సో అవుట్ సైడ్ పుడ్ అయినా.. ఫుడ్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడైనా ప్రతిఒక్కరూ కేర్ ఫుల్‌గా ఉండాల్సిందే.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..