Seeds Shortage: తెలంగాణ రాష్ట్రానికి రుతుపవానాల రావడంతో ఖరీఫ్ సీజన్ కోసం రైతులు సిద్దమవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే విత్తనాలు వేసేందుకు కూడా రైతులు రెడీ అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే దుక్కులు దున్ని సమాయత్తమవుతున్నారు. ముందస్తుగా ఎరువులు, మందులు, విత్తనాలు సమకూర్చుకునేందుకు జిల్లా కేంద్రం బాట పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతం అయి కనిపిస్తుండటంతో.. వర్షాలు కురుస్తాయన్న ఆశతో పత్తి విత్తనాల కోసం దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. జిల్లా రైతులతో పాటు సరిహద్దు జిల్లా మహారాష్ట్ర రైతులు సైతం ఆదిలాబాద్ పత్తి విత్తనాల షాపుల ముందు బారులు తీరుతున్నారు.
అయితే డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో.. విత్తనాల దుకాణాల దగ్గర రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు విత్తనాల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా రైతులకు కాకుండా పక్క రాష్ట్రాల రైతులకు అధిక ధరలకు విత్తనాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆదిలాబాద్ రైతులు ఆరోపిస్తున్నారు. స్టాక్ అయిపోయిందంటూ కొందరు దుకాణాదారులు విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం ఆరు గంటలు ఎదురు చూస్తే తప్ప పత్తి విత్తనాలు దొరకడం లేదంటున్నారు రైతులు. వ్యవసాయ అధికారులు స్పందించి స్థానిక రైతులకే విత్తనాలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..